Last Updated:
ఓ స్టార్ హీరో తన మాజీ భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు. అంతేకాదు పురోహితుడిగా ఆయనే వ్యవహరించి ఆశ్చర్యపరిచాడు.
హాలీవుడ్ స్టార్ హీరో, ‘స్పైడర్ మ్యాన్’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘టోబీ మాగైర్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సూపర్ హీరో.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయంతో వార్తల్లో నిలిచారు. టోబీ తన మాజీ భార్య జెన్నిఫర్ మేయర్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆశ్చర్యకరంగా ఆమె రెండో పెళ్లికి టోబీ మాగైర్ దగ్గరుండి మరీ జరిపించారు. అంతేకాదు ఏకంగా ఆ వివాహానికి పురోహితుడి (అఫిషియంట్)గా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
జ్యువెలరీ డిజైనర్ అయిన జెన్నిఫర్ మేయర్.. నైజీరియన్ బిలియనీర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అడెబాయో ఒగున్లేసి కుమారుడైన మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ ఒగున్లేసిని వివాహం చేసుకున్నారు. ఈ అంగరంగ వైభవమైన పెళ్లి వేడుక అక్టోబర్ 10వ తేదీన హవాయి దీవుల్లోని విలాసవంతమైన ఫోర్ సీజన్స్ రిసార్ట్ లానైలో జరిగింది. ఈ వేడుకలో టోబీ మాగైర్ స్వయంగా పురోహితుడిగా మారి వధూవరుల చేత ప్రమాణాలు చేయించడం విశేషం. వివాహానంతరం కొత్త దంపతులు ముద్దు పెట్టుకుంటున్న సమయంలో వెనుక టోబీ చిరునవ్వుతో నిలబడి ఉన్న దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు టోబీ ప్రాణ స్నేహితుడు, హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోతో సహా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
🚨 BREAKING: Tobey Maguire reportedly officiated the wedding of his ex-wife, Jennifer Meyer, and billionaire heir Geoffrey Ogunlesi, just weeks after finalizing his divorce from Meyer. https://t.co/yWZEPajJ0c
— People Of The Internet (@PeopleOfTheInt) October 12, 2026
టోబీ మాగైర్, జెన్నిఫర్ మేయర్‌ల వివాహం 2007లో జరిగింది. వీరికి రూబీ (19), ఓటిస్ (17) అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు సాగిన వీరి వైవాహిక జీవితం తర్వాత, 2016లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 2020లో జెన్నిఫర్ విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ ప్రక్రియ తర్వాత గత నెల సెప్టెంబర్ 21వ తేదీన వీరి విడాకులు చట్టబద్ధంగా పూర్తయ్యాయి. విడాకులు అధికారికంగా పూర్తయిన కొన్ని వారాల్లోనే జెన్నిఫర్ తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు.














