Last Updated:
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలితో కలిసి ఈ కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల్లోపు తప్పనిసరిగా ప్రకటించాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల పనితీరుపై ప్రభావం చూపే కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న జాప్యాలను అరికట్టేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగిస్తూ అన్ని హైకోర్టులకు బైండింగ్ మార్గదర్శకాలు జారీ చేసింది. జార్ఖండ్ హైకోర్టులో తీర్పుల వెలువడటం, వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంలో తీవ్ర ఆలస్యంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలితో కలిసి ఈ కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల్లోపు తప్పనిసరిగా ప్రకటించాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ, బెయిల్ వంటి అంశాలకు సంబంధించిన కేసుల్లో మరింత వేగంగా తీర్పులు రావాలని కోర్టు అభిప్రాయపడింది.
బెయిల్ దరఖాస్తులపై అదే రోజు ఉత్తర్వులు ఇవ్వడం ఉత్తమ విధానమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకవేళ తీర్పును రిజర్వ్ చేస్తే మరుసటి రోజే వెల్లడించాల్సిందిగా స్పష్టం చేసింది. అలాగే బెయిల్ మంజూరైన వెంటనే సంబంధిత ట్రయల్ కోర్టులు, జైలు అధికారులకు ఆదేశాలు పంపించి, విచారణ ఖైదీలను అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని సూచించింది.
తీర్పుల పారదర్శకత, ప్రజలకు అందుబాటు అంశాలపైనా కోర్టు దృష్టి పెట్టింది. తీర్పు వెల్లడించిన 24 గంటల లోపు హైకోర్టుల అధికారిక వెబ్‌సైట్లలో పూర్తి కాపీని అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. తీర్పులో అమలు చేయాల్సిన భాగాన్ని ఓపెన్ కోర్టులో ప్రకటించిన తేదీనే ఆ తీర్పు అధికారిక విడుదల తేదీగా పరిగణించాలంటూ స్పష్టం చేసింది. పూర్తి కారణాలతో కూడిన తీర్పు ప్రతిని ఏడు రోజుల్లోపు వెబ్‌సైట్‌లో ఉంచాలని పేర్కొంది.
హైకోర్టులు ఈ మార్గదర్శకాలను అమలు చేయడానికి తమ వెబ్‌సైట్లలో అవసరమైన సాంకేతిక మార్పులు చేయాలని సూచించింది. వాదనలు పూర్తై తీర్పు రిజర్వ్ చేసినప్పుడు, ఆ విషయాన్ని హైకోర్టు వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపింది. తీర్పు మూడు నెలల్లో రాకపోతే సంబంధిత రిజిస్ట్రార్ జనరల్ ఆ విషయాన్ని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ తర్వాత కూడా రెండు వారాల్లో తీర్పు వెలువడకపోతే కేసును మరో బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
న్యాయం ఆలస్యం కావడం అంటే ప్రజలకు ఇబ్బందులు పెరగడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా వేలాది మంది న్యాయం కోసం హైకోర్టులను ఆశ్రయిస్తుండటంతో సకాలంలో తీర్పులు ఇవ్వడం అత్యంత అవసరమని వ్యాఖ్యానించింది. అయితే ఈ మార్గదర్శకాలు వ్యక్తిగత న్యాయమూర్తులపై విమర్శలుగా కాకుండా, న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే చర్యలుగా చూడాలని కోర్టు స్పష్టం చేసింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 29, 2026 12:32 PM IST













