Tamil Nadu: తమిళనాడులో AIADMKకు మరో భారీ షాక్.. ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామా.. విజయ్ పార్టీలో చేరిక! | | ACTPnews

విజయ్ పార్టీలో చేరనున్న ముగ్గురు అన్నాడీఎంకే ఎంఎల్యేలు


Last Updated:

తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే పార్టీకు ముగ్గురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. షణ్ముగం రెబెల్ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో చేరారు.

విజయ్ పార్టీలో చేరనున్న ముగ్గురు అన్నాడీఎంకే ఎంఎల్యేలు
విజయ్ పార్టీలో చేరనున్న ముగ్గురు అన్నాడీఎంకే ఎంఎల్యేలు

Tamil Nadu: తమిళనాడులో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే (AIADMK)కు సోమవారం మరో ఘోర పరాభవం ఎదురైంది. పార్టీ సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ రోజు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వారు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు.

అసెంబ్లీలో 44కు పడిపోయిన ఏఐఏడీఎంకే బలం

ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కే. మరగాథమ్, డి. జయకుమార్, వి. సత్యభామ ఈ రోజు తమిళనాడు శాసనసభ స్పీకర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను అధికారికంగా సమర్పించారు. ఈ ముగ్గురి రాజీనామాలతో 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఏఐఏడీఎంకే పార్టీ బలం కేవలం 44 స్థానాలకు పడిపోయింది. తాజాగా ఖాళీ అయిన ఈ మూడు నియోజకవర్గాలతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న తిరుచిరాపల్లి (ఈస్ట్) స్థానానికి రాబోయే ఆరు నెలల కాలంలో ఉప ఎన్నికలు (బై-ఎలక్షన్స్) జరిగే అవకాశం ఉంది.

సంక్షోభంలో పళనిస్వామి నాయకత్వం

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గత మే 13న అసెంబ్లీలో జరిగిన అత్యంత కీలకమైన బలపరీక్ష (ఫ్లోర్ టెస్ట్) సమయంలో.. ఏఐఏడీఎంకేకు చెందిన కనీసం 24 మంది రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ సీఎం విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.

ఓటమి, అసమ్మతి, పార్టీ ఫిరాయింపులు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాలకు గాను ఏఐఏడీఎంకే కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. మరోవైపు నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాలు సాధించి అతిపెద్ద శక్తిగా అవతరించింది. అయితే, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ (118 స్థానాలు) కంటే 10 సీట్లు తక్కువ కావడంతో తీవ్రమైన రాజకీయ చర్చలు నడిచాయి.

ఈ ఎన్నికల ఫలితాలతో తమిళనాడు రాజకీయాల్లో ‘డీఎంకే వ్యతిరేక కూటమి’కి తిరుగులేని నేతగా ఉన్న ఈపీఎస్ పట్టు కోల్పోయారు. పైగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఈపీఎస్ తమ పరమశత్రువైన డీఎంకేతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారంటూ సి.వి. షణ్ముగం వర్గం తీవ్ర తిరుగుబాటుకు తెరలేపింది. విప్‌ను తోసిరాజని 24 మంది రెబెల్ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వ బలం 144కు చేరింది. ఈ ఫిరాయింపులపై ఏఐఏడీఎంకే ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports