Tariff War: భారత్‌కు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 60 దేశాలపై అమెరికా కొత్త సుంకాలు! | | ACTPnews

డొనాల్డ్ ట్రంప్


Last Updated:

Tariff War: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా కొత్త సుంకాలను ప్రకటించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలికంగా విధించిన 10 శాతం ప్రపంచ సుంకానికి తుది గడువు గురువారం అర్ధరాత్రితో ముగియడంతో దాని స్థానంలో ఈ కొత్త సుంకాలను తీసుకొచ్చారు.

డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్

అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జేమీసన్ గ్రీర్ ప్రకటించిన ఈ నూతన సుంకాలు ఈస్టర్న్ టైమ్ ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12:01 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం నేటి నుంచి) అమలులోకి రానున్నాయి. ఉత్పాదనలో వెట్టిచాకిరీ (Forced Labour) నిరోధక నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకుగాను ఈ చర్యలు చేపట్టినట్లు USTR వెల్లడించింది. ఈ కొత్త సుంకాలు 10 శాతం నుండి 12.5 శాతం వరకు ఉండనుండగా, అమెరికా చేసే మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో సుమారు 99.4 శాతం దిగుమతులపై ప్రభావం చూపనున్నాయి.

“అమెరికా దాదాపు శతాబ్ద కాలంగా వెట్టిచాకిరీతో తయారైన ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించి, దాన్ని కఠినంగా అమలు చేస్తోంది. మా వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే బాటలో నడవాల్సిన సమయం ఎప్పుడో వచ్చింది” అని వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ స్పష్టం చేశారు.

భారత్, చైనా, ఈయూలపైనా ప్రభావం

ఈ కొత్త పన్నుల పరిధిలోకి భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ (EU) సహా ప్రధాన వాణిజ్య దేశాలు వచ్చాయి. చట్టబద్ధంగా వెట్టిచాకిరీ నిరోధక చట్టాలను ఇప్పటికే అమలు చేస్తున్న లేదా అమెరికాతో సంబంధిత ఒప్పందాలు చేసుకున్న కెనడా, బ్రిటన్, ఈయూ, భారత్ వంటి దేశాలకు తక్కువ శ్లాబ్ అయిన 10 శాతం సుంకం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.

అదే సమయంలో ఇటువంటి నిరోధక చర్యలు కఠినంగా లేని చైనా, జపాన్ వంటి ఇతర 45 దేశాల ఉత్పత్తులపై 12.5 శాతం గరిష్ఠ సుంకం పడనుంది. అయితే ఉక్కు, అల్యూమినియం వంటి ఇదివరకే ప్రత్యేక సుంకాలు ఎదుర్కొంటున్న రంగాలు, మరియు యూఎస్-మెక్సికో-కెనడా (USMCA) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద వచ్చే సరుకులకు ఈ కొత్త సుంకాల నుండి మినహాయింపు లభించింది.

న్యాయపరమైన సవాళ్లను తట్టుకునేలా..

గతంలో ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలను ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం మరొక చట్టం (Section 122) కింద 150 రోజుల తాత్కాలిక సుంకం విధించింది. ఆ గడువు నేటితో తీరిపోవడంతో, ఇప్పుడు 1974 వాణిజ్య చట్టంలోని ‘సెక్షన్ 301’ కింద నెలల తరబడి సమగ్ర విచారణ జరిపి, కోర్టు సవాళ్లను తట్టుకునే రీతిలో ఈ నూతన సుంకాలను ఆమోదించారు.

మరోవైపు పరిమితికి మించి పారిశ్రామిక ఉత్పత్తి (Excess Capacity) పెంచుతున్నాయనే ఆరోపణలపై మరొక 16 దేశాల ఆర్థిక వ్యవస్థలపై అమెరికా ప్రత్యేక విచారణ జరుపుతోంది. ఆ విచారణల ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని అదనపు సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports