Team India: రిషభ్ పంత్‌కు బీసీసీఐ షాక్! ఆ పదవి నుంచి తప్పించేందుకు రెడీ | క్రీడా వార్తలు | ACTPnews

రిషభ్ పంత్


Last Updated:

టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం.

రిషభ్ పంత్
రిషభ్ పంత్

Team India: అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు, వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్షన్ కమిటీ మంగళవారం జట్టును ప్రకటించనుంది. అయితే ఈ ఎంపిక ప్రక్రియ సాధారణంగా సాగేలా కనిపించడం లేదు. లీక్ అవుతున్న అంతర్గత సమాచారం ప్రకారం.. టీమిండియాలో ముఖ్యంగా టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం.

నాయకత్వ భారంతో దెబ్బతింటున్న బ్యాటింగ్!

రిషభ్ పంత్ భారత్ తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించిన గొప్ప ‘మ్యాచ్ విన్నర్’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అదనంగా నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడు అది అతని సహజసిద్ధమైన దూకుడైన బ్యాటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం సెలెక్టర్లలో బలంగా వ్యక్తమవుతోంది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

అంతేకాకుండా, గత నవంబరులో గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ మ్యాచ్‌లో అతడు తన వ్యూహాత్మక చతురతను నిరూపించుకోవడంలో వైఫల్యం చెందాడు. “పంత్ లాంటి కీలకమైన బ్యాటర్‌ను భారత్ ఏ రకంగానూ కోల్పోకూడదు. బాధ్యతల ఒత్తిడి లేకుండా అతనికి బ్యాటింగ్‌లో పూర్తి స్వేచ్ఛను కల్పించడమే జట్టుకు మేలు చేస్తుంది” అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. దీనికి తోడు వన్డేల్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడుతుండటం, బ్యాకప్ కీపర్లుగా ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ల నుంచి గట్టి పోటీ ఉండటంతో పంత్‌కు వన్డే జట్టులో స్థానం దక్కడం కూడా కష్టంగా మారింది.

సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై గంభీర్ నిర్ణయం ఏంటి?

ఈ పర్యటనలో అఫ్గానిస్తాన్‌తో టీ20 మ్యాచ్‌లు లేనప్పటికీ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై కూడా సెలెక్టర్లు లోతుగా చర్చించబోతున్నారు. గత రెండేళ్లుగా సూర్య వన్డే, సుదీర్ఘ ఫార్మాట్లలో అత్యంత పేలవమైన ఫామ్‌తో తడబడుతున్నాడు. ముఖ్యంగా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శకం ప్రారంభం కానుండటంతో, కెప్టెన్‌గా సూర్య భవిష్యత్తు గంభీర్ ఇచ్చే నివేదికపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ మేనేజ్‌మెంట్ గట్టి నిర్ణయం తీసుకుని అతని నుంచి కెప్టెన్సీని తొలగిస్తే.. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సాధారణ ఆటగాడిగా కూడా సూర్య తుది జట్టులో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

బుమ్రా ‘వర్క్‌లోడ్’ మేనేజ్‌మెంట్.. మయాంక్ యాదవ్‌కు పిలుపు?

మరోవైపు, టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంపికపై మెడికల్ టీమ్ ఇచ్చే ఫిట్‌నెస్ రిపోర్ట్ కీలకంగా మారింది. బీసీసీఐ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, పనిభార నిర్వహణ (Workload Management) లో భాగంగా బుమ్రా అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు మాత్రమే పరిమితం కానున్నాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ నుండి అతనికి పూర్తి విశ్రాంతి ఇవ్వనున్నారు.

బుమ్రా స్థానంలో ఐపీఎల్‌లో గంటకు 150 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులు విసురుతూ సంచలనం సృష్టించిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌ను తొలిసారిగా వన్డే జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళవారం సెలెక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించబోయే ఈ నిర్ణయాలు భారత క్రికెట్‌లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *