Last Updated:
న్యూజిలాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్ టీమిండియాకు తలనొప్పిగా మారింది. టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేయాల్సి ఉండటంతో ఆఖరి రెండు వన్డేలకు శుభ్మన్ గిల్, బుమ్రా సహా పలువురు స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు.
ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో టీమిండియా న్యూజిలాండ్తో సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో కివీస్ జట్టు భారత్తో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్లు ఆడుతుంది. అయితే బోర్డు ఖరారు చేసిన షెడ్యూల్ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఐదో వన్డే ముగిసిన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ స్వల్ప గ్యాప్ కారణంగా టెస్టు జట్టులో ఉండే కీలక ఆటగాళ్లకు ప్రాక్టీస్ కష్టంగా మారింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో అత్యంత కీలకమైన ఈ టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు ఐదో వన్డేతో పాటు నాలుగో వన్డేకు కూడా స్టార్ ఆటగాళ్లను దూరం పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షెడ్యూల్ ఒత్తిడి కారణంగానే చివరి రెండు వన్డేలకు సీనియర్లు లేని ద్వితీయ శ్రేణి జట్టును బరిలోకి దించక తప్పని పరిస్థితి నెలకొంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఈ సిరీస్ భారత్కు ఎంతో ముఖ్యం.
వన్డేలతో పాటు టెస్టు జట్టులోనూ రెగ్యులర్ సభ్యులుగా ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తదితరులు చివరి రెండు వన్డేలు ఆడరని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా వన్డే సిరీస్ మధ్యలోనే వీడి, తొలి టెస్టు జరిగే వెల్లింగ్టన్కు ముందుగానే పయనమవుతారు. గిల్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆఖరి రెండు వన్డేలకు భారత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. టెస్టు క్రికెట్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే గిల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది కూడా ఈ సిరీస్ కోసం రెండు బృందాలుగా విడిపోనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ సితాంషు కోటక్, ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్లలో ఇద్దరు వన్డే జట్టుతో ఉండనుండగా, మిగిలిన ఇద్దరు టెస్టు జట్టుతో ముందుగానే వెల్లింగ్టన్ చేరుకుంటారు. వన్డేల తర్వాత టీ20 సిరీస్ పెట్టి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. టీ20 జట్టు, టెస్టు జట్టులో దాదాపు వేర్వేరు ఆటగాళ్లు ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని చెబుతున్నారు. షెడ్యూల్ రూపొందించే సమయంలో కనీస ఆలోచన చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
India’s tour of New Zealand: Full schedule
| Date | Match | Venue | Time (IST) |
|---|---|---|---|
| 22 October 2026 | 1st T20I | Christchurch | 12:30 PM |
| 24 October 2026 | 2nd T20I | Christchurch | 12:30 PM |
| 27 October 2026 | 3rd T20I | Wellington | 12:30 PM |
| 30 October 2026 | 4th T20I | Auckland | 12:30 PM |
| 1 November 2026 | 5th T20I | Hamilton | 12:30 PM |
| 4 November 2026 | 1st ODI | Auckland | 7:30 AM |
| 7 November 2026 | 2nd ODI | Wellington | 7:30 AM |
| 10 November 2026 | 3rd ODI | Hamilton | 7:30 AM |
| 13 November 2026 | 4th ODI | Mount Maunganui | 7:30 AM |
| 15 November 2026 | 5th ODI | Mount Maunganui | 7:30 AM |
| 19-23 November 2026 | 1st Test | Wellington | 3:30 AM |
| 27 November-1 December 2026 | 2nd Test | Christchurch | 3:30 AM |














