Hyderabad: శత్రు పక్షం బలహీనంగానే ఉన్నా, ఆ పక్షాన్ని నిలబెట్టేది ఒక్క బలమైన నాయకుడే అయితే… ముందుగా ఆ నాయకుడిని ఆ పక్షం నుంచి వేరు చేయాలి. అప్పుడు ఆ పక్షం మొత్తం కుప్పకూలుతుంది. యుద్ధంలో విజయం సాధించడం సులభమవుతుంది. ఇదే అసలైన రణనీతి. ఇదే రణనీతిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
తెలంగాణలో గంతంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో… ఇప్పుడు పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. ఆయనకు, పార్టీకి మధ్య అఘాదం సృష్టిస్తే తెలంగాణలో విజయం సాధించవచ్చనే విశ్వాసంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారనేది విశ్లేషకుల అంచనా. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవల దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం అనంతరం మోదీ, రేవంత్ లో సమావేశం సందర్భంగా ఉన్న ఫోటోలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.
ఆ ఫోటోను విశ్లేషిస్తూ మానసిక విశ్లేషణలో మూడు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ సైకాలజిస్ట్ వంగీపురం శ్రీనివాస చారి న్యూస్18తో విశ్లేశించిన అంశాల ప్రకారం “తలను కొద్దిగా వంచి, బలమైన చేతి గ్రిప్ తో రేవంత్ రెడ్డి నమ్రత, విధేయత, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. బలమైన చేతి గ్రిప్ తో పాటు, చిరునవ్వును ప్రదర్శిస్తూ, రెండవ చేతితో కూడా పట్టు సాధించి నరేంద్ర మోదీ పెద్దరికాన్ని, అనుభవ సామర్థ్యాన్ని, హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి సాహస స్వభావాన్ని నియంత్రిస్తున్న నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులకు ఓ సవాలు. బీజేపీ నాయకులకు ఉత్సాహం. రేవంత్ మనవాడే అన్న భావన మోదీలో టన్నులకొద్ది ఉంది.” అని విశ్లేషించారు. ఇదే ఫోటోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ మోదీ, రేవంత్ కలిసిపోయారు అనే కామెంట్లు కూడా వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి.
ఇక… కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ కు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కకపోవడానికి కూడా రేవంత్ రెడ్డి కారణం అని ప్రచారం చేసే ప్రయత్నం బీజీపీ వైపు నుంచి సాగుతోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గియా మాట్లాడుతూ మీనాక్షి తెలంగాణలో కేసుల విషయం తమకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచే సమాచారం అందిందని… అలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని బాంబు పేల్చేరు. దీంతో అందరూ రేవంత్ రెడ్డివైపు అనుమానంగా చూడటం ప్రారంభించారు.
అంతేకాదు… సమయం దొరికినప్పుడల్లా రేవంత్ తమ వాడేనని అనిపించేలా మోదీ ప్రయత్నం చేస్తున్నారు. మే నెలలో హైదరాబాద్ పర్యనకు వచ్చిన సందర్భంలోనూ మరో కలిసి పోండి (మెరె సే జుడో) అన్నారు. 2024 మర్చి నెలలో రాష్ట్ర పర్యటన సందర్భంగా మోదీని ఉద్ధేశించి రేవంత్ మీరు పెద్దన్నలా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఇలా మోదీ రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించినా…. రేవంత్ మోదీని ఉద్ధేశించి మాట్లాడినా ఇద్దరి మధ్య ఏదో సాన్నిహిత్యం ఉందనే ప్రచారం సాగుతుంది. విపక్షాలేతే వీరిద్దరూ ఒకటేనని వ్యాఖ్యానిస్తున్నాయి. “రేవంత్, మోదీ వారిద్దరు ఒకటే అనే అంశంలో అనుమానమే లేదు. బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా మీనాక్షీ నాటరాజన్ కేసు విషయంపై సమాచారం ఇచ్చింది రేవంత్ రెడ్డి లేదా ఆయన మనుషులు. దమ్ముంటే రేవంత్ రెడ్డి విచారణ జరిపించి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలి.” అని బీఆర్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ న్యూస్18తో అన్నారు. మరోవైపు… ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీ రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారును నడిపిస్తుందే బీజేపీ నరేంద్ర మోదీ అని ఆరోపించారు.
“ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకుండా ఫోక్సో కేసు నమోదైన తొమ్మిది రోజుల వరకు కేంద్ర మంత్రి కుమారున్ని కాపాడారు. పైన మోదీ ప్రభుత్వం. ఇక్కడ జోడీ ప్రభుత్వం. ఒకరికొకరు కాపాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని పీఎం అన్నారు. ఎందుకు చర్యలు తీసకోలేదు. ముమ్మాటికి రేవంత్ రెడ్డిని కాపాడుతుంది నరేంద్ర మోదీనే.” అని న్యూస్18 ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రతిపక్షాలు ఒక వైపు.. బీజేపీ మరో వైపు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా పార్టీ అధినాయత్వానికి, రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరుగేలా బీజేపీ ప్యవహరిస్తున్నారనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2028 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోసం పరితపిస్తున్న బీజేపీకి ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అంతటి బలమైనా నాయకులు లేరు కాబట్టి పార్టీ నిలబడదని.. దీని ద్వారా బీజేపీ ఎదుగుదలకు అవకాశం లభిస్తుందనేది ఆ పార్టీ అంచనాగా కనిపిస్తుంది.
ఈ అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు న్యూస్18తో మాట్లాడుతూ, “ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ మారాల్సిన అవసరం లేదు. మారినా ఆయన ముఖ్యమంత్రి పదవి ఉండదు. బీజేపీ తన రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసం ఏమైనా చేస్తుంది. దాంట్లో భాగంగానే రేవంత్ తమతో సన్నిహితంగా ఉంటారని ప్రచారం చేయండంలో సఫలీకృతం అయింది.” అన్నారు.
రేవంత్ రెడ్డి కూడా బీజేపీ ప్రచారాన్ని గట్టిగా ఖండించిన దాఖలాలు కనిపించడం లేదని రవి చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ రేవంత్ రెడ్డితో మైండ్ గేమ్ ఆడుతోందని కొన్ని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని చెప్పారు. “బీజేపీ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి కూడా పాజిటీవ్ గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అందరితో సత్సంబంధాలున్నాయి అని చెప్పుకునే ప్రయత్నం కావొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఒక ప్రధానమైన అస్త్రం. ఎంత ప్రచారం జరిగినా రేవంత్ ను దూరం చేసుకనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు.” అని రవి చెప్పారు.
భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి. ఎన్నికల అనంతరం పొత్తులు, ఎత్తులు ఎలా ఉంటాయనే అంశం పక్కనబెడితే ఇవన్నీ రాజకీయ పార్టీల ఎత్తులు, పైఎత్తులుగానే అర్థం చేసుకోవాలనేది విశ్లేషకుల అభిప్రాయం.












