Last Updated:
తెలంగాణలో టెలివిజన్ రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సినీ రంగంతో పాటు బుల్లితెర కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మక ‘టెలివిజన్ అవార్డుల’ను ప్రవేశపెట్టనుంది.
తెలంగాణలో టెలివిజన్ రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సినీ రంగంతో పాటు బుల్లితెర కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మక ‘టెలివిజన్ అవార్డుల’ను ప్రవేశపెట్టనుంది. ఈ అవార్డుల రూపకల్పన, విధివిధానాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టెలివిజన్ అవార్డు కమిటీ ప్రతినిధులతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ఎండీ ముకుంద రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రధానంగా అవార్డులకు ఒక విశిష్ట వ్యక్తి పేరును పెట్టడం, ప్రత్యేక లోగో, కేటగిరీలు, ఎంపిక ప్రక్రియ గురించి సుదీర్ఘంగా చర్చించారు. టెలివిజన్ అవార్డులకు బహుభాషా కోవిదుడు, భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన గొప్ప మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కమిటీ సభ్యులు ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన మంత్రి.. పీవీ తెలంగాణ ఠీవి అని, అలాంటి మహనీయుని పేరును అవార్డులకు పెట్టే అంశం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
నేటి సమాజంలో ప్రజలకు ఎక్కువ వినోదాన్ని అందిస్తున్న టెలివిజన్ రంగం ఎంతో కీలకమైనదని మంత్రి కొనియాడారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, సమాజానికి మంచి సందేశం ఇచ్చే సీరియల్స్, విద్యా సంబంధిత ప్రోగ్రామ్స్, పిల్లల ఆసక్తిని పెంచే చిత్రాలు తీసే వారిని ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
త్వరలోనే ఈ అవార్డులకు సంబంధించిన విధివిధానాలు, గైడ్ లైన్స్, లోగో డిజైన్ రూపొందించాలని కమిటీని ఆదేశించారు. అయితే, ఎంపిక చేసే పేరు మరియు లోగోలో ‘తెలంగాణ ఆత్మ’ ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరగాలని, అలాగే అవార్డుల ప్రదానోత్సవానికి అనువైన రెండు లేదా మూడు వేదికల ఆప్షన్స్ ఇవ్వాలని ఎఫ్డీసీ ఎండీ ముకుంద రెడ్డికి మంత్రి సూచించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














