The Odyssey: అవతార్‌ను మించిన విజువల్స్.. సముద్రంలోనే 80 శాతం షూటింగ్.. థియేటర్లను షేక్ చేయబోతున్న ఇంటర్నేషనల్ ఎపిక్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ సినిమా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోమర్ రాసిన చిరస్మరణీయ గ్రీకు ఇతిహాసాన్ని అత్యాధునిక ఐమ్యాక్స్ టెక్నాలజీతో తెరపై ఎలా ఆవిష్కరించారో తెలుసుకోండి.

News18
News18

హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో గ్రీకు మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey). ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ జూలై 17న థియేటర్లలోకి రాబోతోంది. హోమర్ రాసిన జగత్ప్రసిద్ధ గ్రీకు ఇతిహాస గాథలు ‘ఇలియాడ్’, ‘ది ఒడిస్సీ’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో మొదటి భాగమైన ‘ఇలియాడ్’ కథను మనం 2004లో వచ్చిన ‘ట్రాయ్’ సినిమాలో ఇప్పటికే చూశాం. మరి ఈ సరికొత్త సినిమాకు వెళ్లే ముందు, అసలు దీని కథేంటి? తెరవెనుక జరిగిన యుద్ధం ఏంటి?

అసలు ‘ది ఒడిస్సీ’ కథేంటి? బ్యాక్‌డ్రాప్ ఇదీ..

కథలోకి వెళ్తే.. అనగనగా ఒక గ్రీకు రాజ్యం. దానికి అగమెమ్నన్ రాజు. అతడికి మెనలియస్ అనే తమ్ముడు ఉంటాడు. మెనలియస్ భార్య హెలెన్.. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా పేరుపొందింది. గ్రీకుకు సమీపంలోనే ‘ట్రాయ్’ అనే మరో శక్తివంతమైన రాజ్యం ఉంటుంది. దీనికి రాజు ప్రియమ్. ఆయనకు హెక్టార్, పారిస్ అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. చిన్నవాడైన పారిస్ భలే అందగాడు.

ఒకసారి గ్రీకు రాజ్యాన్ని సందర్శించడానికి వెళ్లిన పారిస్‌కు, మెనలియస్ ఆతిథ్యమిస్తాడు. ఆ సమయంలో మెనలియస్ భార్య హెలెన్‌ను చూసి పారిస్ ప్రేమలో పడతాడు. పారిస్ అందానికి హెలెన్ సైతం మంత్రముగ్ధురాలవుతుంది. దీంతో గ్రీకు నుండి తిరిగి వెళ్లేటప్పుడు పారిస్ ఆమెను తీసుకుని ట్రాయ్ రాజ్యానికి వచ్చేస్తాడు. ఇది అవమానంగా భావించిన గ్రీకులు, తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి వేల నౌకలతో ట్రాయ్ రాజ్యంపై యుద్ధానికి వెళ్తారు.

ట్రాయ్ యుద్ధంలో అగమెమ్నన్, మెనలియస్‌లతో పాటు అకిలిస్, అజాక్స్ వంటి మహావీరులు గ్రీకుల తరఫున పాల్గొంటారు. వీరందరికన్నా అత్యంత తెలివైన రాజు, యుద్ధ వ్యూహకర్త అయిన ఒడిస్సియస్ కూడా ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాడు. యుద్ధ ప్రణాళికలు రచించడం, వాటిని అమలు చేయడం, శత్రు సేనలపై మెరుపు దాడులు చేయడంలో ఒడిస్సియస్ మేటి.

ఈ యుద్ధం దాదాపు పదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. ఇరుపక్షాలు చిన్న చిన్న ఘర్షణలు చేస్తూనే ఉంటాయి. అయితే, చివరి ఏడాది పరిణామాలు వేగంగా మారిపోతాయి. యుద్ధంలో అకిలిస్‌కు అత్యంత సన్నిహితుడైన ప్యాట్రోక్లస్‌ను ట్రాయ్ యువరాజు హెక్టార్ చంపేస్తాడు. దీంతో తీవ్ర అగ్రహానికి లోనైన అకిలిస్ రణరంగంలోకి దూకి, హెక్టార్‌ను ఒంటరిగా ఎదుర్కొని అంతం చేస్తాడు. తన అన్న మరణానికి ప్రతీకారంగా, ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అకిలిస్‌ను పారిస్ హతమారుస్తాడు.

ఇరు సైన్యాలు తమ ప్రధాన యోధులను కోల్పోవడం, యుద్ధం ఎంతకూ ముగింపునకు రాకపోవడంతో ఒడిస్సియస్ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేస్తాడు. గ్రీకు నౌకలను ముక్కలు చేసి, వాటితో ఒక భారీ ‘చెక్క గుర్రాన్ని’ (Trojan Horse) తయారు చేయిస్తాడు. దానిని ట్రాయ్ రాజ్య సముద్రతీరంలో వదిలేసి, గ్రీకు సేనలు ఓడిపోయి వెనక్కి వెళ్లిపోయినట్లు నాటకమాడతారు.

ట్రాయ్ సైనికులు గ్రీకులు వెళ్ళిపోయారని భావించి, ఆ చెక్క గుర్రాన్ని విజయ సంకేతంగా తమ రాజకోట లోపలికి తీసుకెళ్తారు. ఆ రోజు రాత్రి ట్రాయ్ ప్రజలంతా సంబరాలు చేసుకుని గాఢ నిద్రలో మునిగిపోతారు. సరిగ్గా అర్ధరాత్రి వేళ, ఆ చెక్క గుర్రం లోపల దాక్కున్న ఒడిస్సియస్ మరియు మరికొందరు గ్రీకు యోధులు రహస్యంగా బయటకు వస్తారు. వారు ట్రాయ్ కోట తలుపులు తెరవడంతో, అప్పటివరకు బయట పొంచి ఉన్న మిగిలిన గ్రీకు సైన్యం లోపలికి ప్రవేశిస్తుంది. అలా ట్రాయ్ రాజ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి, హెలెన్‌ను తీసుకుని గ్రీకులు తిరుగుపయనం అవుతారు. ఇక్కడితో ‘ఇలియాడ్’ కథ ముగుస్తుంది.

ట్రాయ్‌పై యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు రాజ్యానికి పయనమైన ఒడిస్సియస్ కోసం అతడి భార్య, కుమారుడు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ, అతడు మాత్రం ఎంతకీ ఇంటికి చేరడు. గ్రీక్ రాజ్యానికి తిరుగు ప్రయాణమైన ఒడిస్సియస్‌కు సముద్రంలో ఎలాంటి ప్రమాదకరమైన సవాళ్లు ఎదురయ్యాయి? అతడిని అతడి సైన్యాన్ని ఎలాంటి వింత జీవులు, శాపాలు, ఆపదలు చుట్టుముట్టాయి? భార్యాబిడ్డలను చేరుకోవడానికి ఒడిస్సియస్‌కు ఏకంగా పదేళ్ల కాలం పట్టడానికి గల అసలు కారణం ఏంటి? చివరకు అతడు ప్రాణాలతో తన కుటుంబాన్ని కలిశాడా? లేదా? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలన్నింటికీ సమాధానమే క్రిస్టఫర్ నోలన్ విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’. థియేటర్లలో ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని చూసి సరికొత్త అనుభూతిని పొందండి!

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *