The Paradise Movie: ‘ది ప్యారడైజ్’.. సినిమా కాదు, ఒక ప్రపంచం..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

The Paradise Movie: 'ది ప్యారడైజ్'.. సినిమా కాదు, ఒక ప్రపంచం..! | తెలుగు సినిమా వార్తలు


నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు ఎక్కువగా క్లాస్, ఫ్యామిలీ, నేచురల్ క్యారెక్టర్లతో కనిపించిన నాని.. ఒక్కసారిగా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను షాక్ ఇచ్చాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ‘దసరా’ నాని కెరీర్‌లోనే ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. అలాంటి కాంబినేషన్ మళ్లీ కలుస్తోంది అంటే సహజంగానే అంచనాలు పెరుగుతాయి. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో అంచనాలు కేవలం కాంబినేషన్ వల్ల మాత్రమే పెరగలేదు. ఈ సినిమా చుట్టూ మొదటి నుంచి ఒక మిస్టరీ ఉంది. నాని జడలు ఎందుకు పెంచుకున్నాడు? అసలు జడల్ జమానా ఎవరు? ఈ కథలో మోహన్ బాబు పాత్ర ఏంటి? రాఘవ్ జుయల్, సంపుర్ణేష్ బాబు క్యారెక్టర్‌లు ఏంటీ? అసలు ది ప్యారడైజ్ సినిమా కథేంటి? అనే ప్రశ్నలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

‘ది ప్యారడైజ్’ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే.. ముందుగా ‘దసరా’ రోజుల్లోకి వెళ్లాలి. ‘దసరా’ రిలీజై యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై అందరి దృష్టి పడింది. ఆ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

2024 నవంబర్ 6న ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి ఈ పేరు కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఎందుకంటే ‘ప్యారడైజ్’ అంటే స్వర్గం. కానీ సినిమా పోస్టర్లు, గ్లింప్స్‌లో కనిపిస్తున్న ప్రపంచం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. అక్కడ పేదరికం ఉంది.. హింస, అణచివేతతో పాటు తిరుగుబాటు ఉంది. మరి ఇలాంటి ప్రపంచానికి ‘ప్యారడైజ్’ అనే పేరు ఎందుకు పెట్టారు? సినిమా చూసిన తర్వాతే ఆ ప్రశ్నకు అసలు సమాధానం దొరికే అవకాశం ఉంది.

2025 జూన్ 21న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించారు. లైవ్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం కంటే 1980ల కాలాన్ని తమకు కావాల్సిన విధంగా సృష్టించుకునేందుకు సెట్స్‌నే ప్రధానంగా ఉపయోగించారు.

అసలు ది ప్యారడైజ్ కథ ఏంటి?

మేకర్స్ ఇప్పటివరకు సినిమా పూర్తి కథను బయటపెట్టలేదు. కానీ ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్, నాని, శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూలను కలిపి చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. ఒక సమాజం కథ. గుర్తింపు కోసం పోరాడే ఒక మనిషి కథ. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనను అంగీకరించకపోతే.. అదే ప్రపంచాన్ని మార్చేందుకు తిరుగుబాటు చేసే ఒక వ్యక్తి కథ.

కథ 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుంది. అక్కడ అణచివేతకు గురైన ఒక వర్గం ఉంటుంది. గ్లింప్స్‌లో ఈ ప్రజలను కాకులతో పోలుస్తూ ఒక ప్రతీకాత్మక ప్రపంచాన్ని చూపించారు. చరిత్రలో చిలుకల గురించి రాశారు.. పావురాల గురించి రాశారు.. కానీ కాకుల గురించి ఎవరూ రాయలేదనే భావనతో ఈ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఈ ఒక్క ఆలోచనతోనే దర్శకుడు ఏం చెప్పబోతున్నాడనే దానిపై ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది.

ఎవరూ రాయని కథను ఎవరు రాయబోతున్నారు? గుర్తింపు లేని మనిషి తన ఉనికిని ఎలా నిరూపించుకుంటాడు? ఒక సమాజానికి గౌరవం కావాలంటే ఎంత దూరం వెళ్లాలి? ఈ ప్రశ్నల మధ్యే జడల్ జమానా పాత్ర పుడుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ఏంటీ?

ఈ సినిమా కేవలం ఓ సాధారణ యాక్షన్ కథ కాదని, ఓ ప్రత్యేకమైన సంచార జాతి జీవితం, వాళ్ల అస్తిత్వం, గుర్తింపు కోసం సాగిన పోరాటం చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన ‘షికారి’ అనే సంచార జాతి తెలంగాణ ప్రాంతంలో స్థిరపడినట్లు సమాచారం. అప్పట్లో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. వేట, దొంగతనాలు వంటి వాటినే జీవనాధారంగా చేసుకుని ఈ సమాజానికి చెందిన కుటుంబాలు జీవించేవారు. బేసిగ్గా హిందూ ఆచారాలను పాటిస్తూ దేవుళ్లను పూజించే వీరిని.. నిజాం పాలకులు ఇక్కడి నుంచి తరిమేశారు. ఈ కుటుంబాలు వేర్వేరుగా ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. వీరికంటూ ఏ గుర్తింపూ లేదు. కులం లేదు. ఓటు హక్కు లేదు.

ఏ ప్రభుత్వాలూ వీరిని గుర్తించలేదు. చాలా ఏళ్లు దొంగతనాలు చేసుకుంటూనే బతికిన వీరికి ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో కాస్త గుర్తింపు వచ్చింది. రేషన్ కార్డులివ్వడంతో పాటు బీసీలుగా గుర్తించే ప్రయత్నం జరిగింది. ఆ టైంలోనే దొంగతనాల నుంచి నాటు సారా వైపు ఈ సంచార జాతి మళ్లింది. కానీ ఇక్కడే ప్రభుత్వ సారా దుకాణాలను నడిపించే రాజకీయ నాయకులతో వీరికి ఘర్షణ మొదలవడం.. వీరిపై అఘాయిత్యాలు జరగడంతో తిరుగుబాటు మొదలైంది.

ఈ సంచార జాతిని నడిపించే నాయకుడి కథే ‘ది ప్యారడైజ్’లో చూడబోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ‘పుష్ప’, ‘పెద్ది’ సినిమాలను మిక్స్ చేసినట్లుగా ఈ కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’లో హీరో ఇంటిపేరు కోసం పోరాడతాడు. ‘పెద్ది’లో కథానాయకుడు తన ఊరికి గుర్తింపు కోసం తపిస్తాడు. కానీ ‘ది ప్యారడైజ్’లో మాత్రం కథానాయకుడి పోరాటం తనకోసం మాత్రమే కాకుండా.. తన జాతి మొత్తానికి గుర్తింపు తీసుకురావడం కోసం ఉంటుందని సమాచారం. నిజానికి ఇదే కథతో సినిమా వస్తే మాత్రం రికార్డులు తిరగరాయడం పక్కా.

జడల్ జామానా పాత్ర ఏంటీ?

నాని కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో పాత్రలు వచ్చాయి. కొన్ని ప్రేమకథలు.. కొన్ని ఫ్యామిలీ డ్రామాలు, అలాగే థ్రిల్లర్‌తో పాటు ‘దసరా’ లాంటి రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కూడా చేశాడు. కానీ ‘ది ప్యారడైజ్’లో కనిపిస్తున్న జడల్ జమానా మాత్రం వీటన్నింటికంటే భిన్నంగా కనిపిస్తున్నాడు. పొడవాటి జడలు.. గడ్డం.. మీసం.. రఫ్ లుక్.. చేతిలో తుపాకీ.. కళ్లలో కోపం.. శరీరంలో ఒక తిరుగుబాటు కనిపించేలా నాని గెటప్‌ను డిజైన్ చేశారు. ఈ లుక్ బయటకు వచ్చిన మొదటి క్షణం నుంచే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కానీ ఆ జడలు కేవలం నాని లుక్‌ను మాస్‌గా చూపించడానికి పెట్టినవి కావు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన చిన్ననాటి వ్యక్తిగత అనుభవం నుంచి ఈ ఆలోచన పుట్టిందని చెప్పారు. చిన్నతనంలో తన తల్లి తనకు జడలు వేసిన జ్ఞాపకం ఈ పాత్రలోని జడల కాన్సెప్ట్‌కు స్ఫూర్తిగా మారిందని వివరించారు. అందుకే జడల్ జమానా జడలు కేవలం గెటప్ కాదు. ఆ పాత్ర భావోద్వేగ ప్రయాణంలో ఒక భాగం.

నాని స్వయంగా ఈ సినిమా తల్లి-కొడుకు కథ అని చెప్పాడు. దర్శకుడు కూడా సినిమాలో యాక్షన్ కంటే ఎమోషన్ బలంగా ఉంటుందని వివరించాడు. అంటే జడల్ జమానా చేసే పోరాటానికి ఒక వ్యక్తిగత నేపథ్యం ఉంటుంది. అతని జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక తల్లి ఉంటుంది. ఆ బంధం అతని నిర్ణయాలను, అతని ఆలోచనలను, చివరికి అతని తిరుగుబాటును ప్రభావితం చేసే అవకాశం ఉంది.

మోహన్ బాబు నుంచి రాఘవ్ జుయల్ వరకు.. ఈ ప్రపంచంలో అసలు విలన్లు ఎవరు?

‘ది ప్యారడైజ్’లో నాని ప్రపంచానికి ఎదురుగా నిలిచే ప్రధాన శక్తుల్లో మోహన్ బాబు పోషిస్తున్న శికంజా మాలిక్ రోల్ ఒకటి. మోహన్ బాబు వంటి సీనియర్ నటుడిని ఈ తరహా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చూడటం సినిమాపై అంచనాలను పెంచింది. మరోవైపు రాఘవ్ జుయల్ విక్రమ్ మాలిక్‌గా కనిపించనున్నాడు. కిల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్‌ను ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోకి తీసుకురావడం కూడా శ్రీకాంత్ ఓదెల చేసిన ఆసక్తికరమైన కాస్టింగ్. ఈ పాత్ర కోసం దాదాపు ఎనిమిది నెలలు వెతికిన తర్వాత రాఘవ్‌ను ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించాడు.

ఇక కయాదు లోహర్ సుబ్బు పాత్రలో కనిపించనుంది. సంపూర్ణేష్ బాబు బిర్యాని అనే పాత్రలో నటించాడు. ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించిన సంపూర్ణేష్‌కు ఇది పూర్తిగా భిన్నమైన ప్రయత్నం. ది ప్యారడైజ్ ప్రపంచంలో బిర్యాని పాత్రకు కూడా కీలక స్థానం ఉన్నట్లు తెలుస్తుంది.

అనిరుధ్ మ్యూజిక్.. మరో ప్రపంచం:

ఒక రా అండ్ రస్టిక్ ప్రపంచానికి సంగీతం కూడా అదే స్థాయిలో ఉండాలి. అందుకే ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. నాని, అనిరుధ్ కాంబినేషన్ ఇప్పటికే ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల సృష్టించిన 1980ల ప్రపంచానికి అనిరుధ్ ఎలాంటి సౌండ్ ఇస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రిలీజైన పాటలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. అంటే ‘ది ప్యారడైజ్’లో విజువల్స్ ఒక వైపు.. నాని లుక్ మరో వైపు.. అనిరుధ్ మ్యూజిక్ ఇంకో వైపు.. ఇవన్నీ కలిసి ఒక సాలిడ్ థియేట్రికల్ అనుభూతిని క్రియేట్ చేయబోతున్నాయి.

ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి ఎందుకు?

సినిమా విడుదలకు ముందు ట్రైలర్ వస్తుందని ప్రేక్షకులు సాధారణంగా ఎదురుచూస్తారు. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం ఆ సంప్రదాయానికి భిన్నంగా వెళ్లారు. ఈ సినిమాకు థియేట్రికల్ ట్రైలర్ ఉండదని నాని స్వయంగా వెల్లడించాడు. దీనికి ప్రధాన కారణంగా సమయాభావాన్ని నాని వివరించాడు. మంచి ట్రైలర్ కట్ చేయడానికి నాలుగు, ఐదు రోజులు పడుతుందని.. ఆ సమయాన్ని సినిమా క్వాలిటీ కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని చెప్పాడు.

అయితే ఈ నిర్ణయం వల్ల మరో విషయం జరిగింది. సినిమా కథపై ప్రేక్షకుల్లో ఉన్న క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఎందుకంటే ట్రైలర్ ఉంటే కథలోని చాలా విషయాలు ముందే తెలిసిపోయేవి. ఇప్పుడు మాత్రం గ్లింప్స్, పాటలు, పోస్టర్లతో వచ్చిన ముక్కలను కలుపుకుంటూ ప్రేక్షకులు తమకంటూ ఒక కథను ఊహించుకోవాల్సి వస్తోంది. అసలు సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నేరుగా థియేటర్‌లోకి వెళ్లాల్సిందే.

ఇప్పటివరకు మనం చూసింది ‘ది ప్యారడైజ్’ అనే ప్రపంచానికి సంబంధించిన కొన్ని ముక్కలు మాత్రమే. కానీ ఆ ముక్కలన్నింటినీ కలిపితే అసలు బొమ్మ ఇంకా పూర్తిగా కనిపించలేదు. జడల్ జమానా ఎందుకు తిరుగుబాటు చేస్తాడు? అతని తల్లి కథలో ఎంత కీలకం? శికంజా మాలిక్‌తో అతని సంబంధం ఏంటి? విక్రమ్ మాలిక్ పాత్ర అసలు లక్ష్యం ఏంటి? సుబ్బు పాత్ర జడల్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? బిర్యాని పాత్ర ఎలాంటి మలుపు తీసుకొస్తుంది? ‘కాకులు’ అనే ప్రతీక వెనుక అసలు అర్థం ఏంటి? ‘ప్యారడైజ్’ అనే పేరుకు కథలో ఉన్న సంబంధం ఏంటి? అన్నింటికంటే ముఖ్యంగా.. జడల్ జమానా పోరాటం చివరికి ఎక్కడ ముగుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకొన్ని గంటలు వేయిట్ చేయాల్సిందే.. అప్పటివరకు మనం చూసేది జడల్ జమానా నీడ మాత్రమే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports