Tirumala: తిరుమలలో మల్టీలెవెల్ పార్కింగ్! తీరనున్న వాహనదారుల పార్కింగ్ కష్టాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

అయితే, ప్రతిరోజూ సాధారణ రోజుల్లోనే ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు కలిపి దాదాపు 12 వేల నుంచి 16 వేల వరకు తిరుమలకు చేరుకుంటున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Tirumala: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను అదుపు చేయడానికి, భక్తుల పార్కింగ్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొండపై వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు అధునాతన మల్టీలెవెల్ పార్కింగ్ నిర్మాణానికి గల సాధ్యసాధ్యాలపై ఉన్నతాధికారులు ముమ్మరంగా పరిశీలన జరుపుతున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ

ప్రస్తుతం తిరుమల కొండపై కేవలం ఏడువేల వాహనాలకు సరిపడా మాత్రమే పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, ప్రతిరోజూ సాధారణ రోజుల్లోనే ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు కలిపి దాదాపు 12 వేల నుంచి 16 వేల వరకు తిరుమలకు చేరుకుంటున్నాయి.

ముఖ్యంగా రద్దీ సమయాల్లో వసతి గదుల కేటాయింపు కేంద్రాలైన సీఆర్వో, శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద వాహనాలు నిలపడానికి చోటు దొరకడం లేదు. ఎస్వీ మ్యూజియం, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, ప్రధాన కల్యాణకట్ట, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 పరిసరాల్లో పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో భక్తులు తమ వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. లేపాక్షి బాట నుంచి మొదలుకొని హెచ్‌ఎంటీ ఏరియా, నారాయణగిరి, మోదకమిట్ట, వరాహస్వామి సదనం, రాంభగీచా వరకు వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. దీనికి తోడు బాలాజీ, రాంభగీచా బస్టాండ్లకు వచ్చే బస్సుల వల్ల ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మరింత జటిలంగా మారుతోంది. ఈ రద్దీ వల్ల సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముళ్లగుంటలో భారీ పార్కింగ్ కాంప్లెక్స్?

గతంలో తిరుమలలో రెండు చోట్ల మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాలను నిర్మించాలని భావించినప్పటికీ, అందులో ఒకటైన పీఏసీ-5 ప్రాంతాన్ని యాత్రికుల వసతి సముదాయంగా మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ముళ్లగుంట ప్రాంతంలో మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తితిదే ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.

ప్రవేశ, నిష్క్రమణ మార్గాల అనుకూలత, ఇటు ఆలయానికి, అటు ప్రధాన కేంద్రాలకు చేరుకోవడానికి సులభంగా ఉండే లొకేషన్ కావడంతోనే ముళ్లగుంట స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రదేశంలో దాదాపు 3,000 వాహనాలకు చోటు కల్పించేలా పూర్తిస్థాయి పరిశీలన జరిపి, తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, రింగురోడ్డులోని బాలాజీనగర్ సమీపంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఒక ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతించాలనే ఆలోచనలో ఆర్టీసీ ఉంది.

త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు, ధర్మరథాలు

ప్రస్తుతం తిరుమలలో భక్తుల సౌకర్యార్థం 13 ఎలక్ట్రిక్ బస్సులు రోజుకు డజన్ల కొద్దీ ట్రిప్పులతో సేవలు అందిస్తున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చేందుకు పలువురు దాతలు తితిదే రవాణా శాఖను సంప్రదిస్తూ లేఖలు పంపారు. వీటిని పరిశీలించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తితిదే రవాణా ఇన్‌ఛార్జి జీఎం లక్ష్మీప్రసన్న తెలిపారు. అలాగే, స్థానికంగా భక్తులను ఉచితంగా చేరవేసే ప్రస్తుత ‘ధర్మరథం’ బస్సుల సంఖ్యను కూడా 20కి పెంచేందుకు తితిదే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ప్రాజెక్టు గనుక పూర్తయితే తిరుమల కొండపై దశాబ్దాలుగా వేధిస్తున్న పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వతంగా బ్రేక్ పడే అవకాశం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports