Last Updated:
శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. కొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో చాలా మందికి ఊరట లభించనుంది.
కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే శ్రీవాణి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త అందించింది. భారీ విరాళాలు ఇచ్చి స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లే భక్తులకు వసతి పరంగా చిన్న అసౌకర్యం ఉంటూ వస్తోంది. దర్శన సమయం వరకు గంటల తరబడి వేచి ఉండేందుకు సరైన సదుపాయాలు లేకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను అధికారులు గుర్తించారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. విమానాశ్రయాల్లో ఉండే తరహాలో ఒక ఆధునిక విశ్రాంతి కేంద్రాన్ని (లాంజ్‌ను) నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తాజాగా నిర్ణయించింది.
ప్రస్తుతం శ్రీవాణి దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే భక్తులకు వసతి పరంగా కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో విరాళం చెల్లించి, టికెట్లు పొందిన వారికి మాత్రమే టీటీడీ గదులు కేటాయిస్తోంది. కరెంట్ బుకింగ్‌లో శ్రీవాణి దర్శనం కోసం టికెట్లు పొందిన వారికి మాత్రం గదులు దొరకడం లేదు. ఈ విధానంలో ఉదయం తొమ్మిది గంటలకు దర్శన టికెట్ పొందిన భక్తుడు సాయంత్రం నాలుగు గంటల వరకు బయటే వేచి ఉండాల్సి వస్తోంది. ఆ సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో వృద్ధులు, చిన్నారులతో వచ్చే భక్తులు తీవ్రంగా అలసిపోతున్నారు.
ఈ పరిస్థితిని నివారించాలనే ఉద్దేశంతో శ్రీవాణి భక్తులు సౌకర్యవంతంగా వేచి ఉండేందుకు ఒక ప్రత్యేకమైన లాంజ్‌ను సిద్ధం చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఆధునిక లాంజ్ నిర్మాణం కోసం తిరుమలలోని అన్నమయ్య భవనానికి సమీపంలో ఉన్న ‘న్యూ ఉడ్‌సైడ్ హోటల్’ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. గతంలో హోటల్‌గా నడిచిన ఈ భవనం ప్రస్తుతం పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ విశాలమైన ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో నవీకరించి, అత్యధునిక హంగులతో లగ్జరీ లాంజ్‌గా మార్చనున్నారు.
ఈ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సకల సదుపాయాలు కల్పించబోతున్నారు. విమానాశ్రయాల్లో కనిపించే ప్రీమియం లాంజ్‌ల మాదిరిగానే ఇక్కడ కూడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కుర్చీలు, ఆధునిక ఫర్నిచర్, పరిశుభ్రమైన స్నానాల గదులు, వేగవంతమైన ఇంటర్నెట్ (వైఫై) సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు అల్పాహారం, భోజనం చేసేందుకు వీలుగా ఇదే ప్రాంగణంలో ఒక ప్రత్యేక ఫుడ్‌కోర్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. తద్వారా వేచి ఉండే సమయంలో భక్తులు బయటకు వెళ్లే పని లేకుండా అన్ని సదుపాయాలు ఒకే చోట దొరుకుతాయి.
శ్రీవాణి ట్రస్ట్‌కు పది వేల రూపాయలు విరాళంగా ఇచ్చి, అదనంగా ఐదు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసే వారికి స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ మూడు నెలల ముందుగానే ఆన్లైన్ ద్వారా ఐదు వందల మందికి అవకాశం ఇస్తున్నారు. అప్పటికప్పుడు తిరుమలకు వచ్చే వారి కోసం రోజూ మరో ఐదు వందల టికెట్లను కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తున్నారు. వీటిని కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక విమానాల్లో వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో రోజూ రెండు వందల టికెట్లు ఆఫ్‌లైన్ విధానంలో అందిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఈ టికెట్లు పొందొచ్చు. ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే.. మళ్లీ టికెట్ పొందడం కష్టమే. అంతేకాకుండా గతంలో విరాళాలు ఇచ్చి దర్శన భాగ్యం పొందని వారి కోసం రోజూ మరో మూడు వందల టికెట్లను టీటీడీ కేటాయిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కొత్త లాంజ్ అందుబాటులోకి వస్తే శ్రీవాణి భక్తుల తిరుమల యాత్ర మరింత సులభతరం అవుతుంది.
Tirumala,Chittoor,Andhra Pradesh
Jul 23, 2026 11:33 AM IST














