Last Updated:
వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది, టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్తో రోజూ 75 నుంచి 91 వేల మందికి సాఫీ దర్శనం కల్పిస్తోంది.
వేసవి సెలవులు మొదలయ్యాక తిరుమలకు భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. రోజురోజుకీ లక్షలాది మంది శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో తిరుమల మొత్తం జనసంద్రమై కనిపిస్తోంది. అయితే ఇంత భారీ రద్దీ ఉన్నప్పటికీ భక్తులకు గతంలో మాదిరిగా గంటల తరబడి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ సరికొత్త టెక్నాలజీతో పరిస్థితిని నియంత్రిస్తోంది. ప్రస్తుతం తిరుమలలో పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించడంలో కీలకంగా మారింది.
తిరుమల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వందలాది సీసీ కెమెరాల ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు క్షణక్షణం గమనిస్తున్నారు. ఎక్కడ భక్తుల రద్దీ పెరుగుతోంది..? ఎక్కడ క్యూ లైన్లు నెమ్మదిస్తున్నాయి..? ఏ ప్రాంతంలో అదనపు సిబ్బంది అవసరం ఉందనే విషయాలను డిజిటల్‌గా విశ్లేషిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. దీంతో క్యూ లైన్లు పెద్దగా కనిపించకపోయినా భక్తుల ప్రవాహం మాత్రం నిరంతరంగా కొనసాగుతోంది.
ప్రత్యేకంగా నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో భక్తులను బ్యాచ్‌ల వారీగా ముందుకు పంపే విధానం మంచి ఫలితాలు ఇస్తోంది. ఒకేసారి భారీగా జనాన్ని అనుమతించకుండా నియంత్రణతో పంపడం వల్ల తొక్కిసలాట పరిస్థితులు లేకుండా సాఫీగా దర్శనం సాగుతోంది. భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదం, వైద్య సేవలు కూడా వెంటనే అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడైనా రద్దీ పెరిగితే అదనపు సిబ్బందిని పంపిస్తూ పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.
గతంలో తిరుమల రద్దీ అంటే భక్తులకు పెద్ద పరీక్షలా ఉండేది. గంటల తరబడి క్యూల్లో నిలబడటం, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడటం సాధారణమే. కానీ ఇప్పుడు టీటీడీ అమలు చేస్తున్న స్మార్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్ విధానం వల్ల భారీ రద్దీలోనూ భక్తులు తక్కువ ఇబ్బందులతో దర్శనం చేసుకుంటున్నారు. టెక్నాలజీ ఆధారంగా తీసుకుంటున్న సమన్వయ చర్యలు తిరుమలలో కొత్త మార్పుకు నాంది పలుకుతున్నాయి.
ప్రస్తుతం శని, ఆదివారాల్లో 85 వేల మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్న టీటీడీ, సాధారణ రోజుల్లో కూడా 75 వేల మందికి పైగా భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇక మే 2న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం తిరుమల రద్దీ తీవ్రతకు నిదర్శనంగా మారింది. అయినప్పటికీ భక్తులకు ఇబ్బందులు తక్కువగా ఉండేలా టీటీడీ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh













