Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్, నిర్మాత బండ్ల గణేష్.. | | ACTPnews

News18


Last Updated:

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, మంత్రి వివేక్, బండ్ల గణేష్ స్వామి దర్శనం, ఇంధన ధరలపై కేంద్రాన్ని విమర్శించారు, హుండీ ఆదాయం 3.44 కోట్లు, 8 గంటల సర్వదర్శనం

+

News18

కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నిరంతరం తరలివస్తూనే ఉంటారు. తాజాగా బుధవారం ఉదయం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపి విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ మర్యాదల ప్రకారం వీరికి టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెబుతూనే, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పెట్రోల్ ధర రూ. 60 లోపే ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు. ఇంధన ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతోందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే మొత్తం 76,240 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో 28,257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.44 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

దర్శన సమయాల విషయానికి వస్తే సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తుల రద్దీ కారణంగా సుమారు 10 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లు నిండిపోయి ఉన్నాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టిటిడి నిరంతరాయంగా అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేస్తోంది. రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports