Last Updated:
టీటీడీ తిరుమలలో ప్రధాన వీధులు, సర్కిళ్లకు వేదాలు, ఆళ్వార్లు, భక్తుల పేర్లు పెట్టింది, ఔటర్ రింగ్ రోడ్ ను తిరువేంకటపథం, ఇన్నర్ రింగ్ రోడ్ ను అన్నమాచార్య మార్గంగా నామకరణం చేసింది
శ్రీవారి భక్తులకు, తిరుమల వెళ్లే యాత్రికులకు ఇది ఒక మధురమైన శుభవార్త. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల గిరిపై ఇకపై అడుగు వేస్తే ఆధ్యాత్మికత అణువణువునా ప్రతిధ్వనించనుంది. గోవిందుడి పాదస్పర్శతో పునీతమైన ఆ కొండలపై ఇప్పటివరకు సాధారణ పేర్లతో పిలుచుకున్న వీధులు, కూడళ్లు ఇకపై పురాణ వైభవాన్ని, వేద వేదాంత సారానిని చాటిచెప్పనున్నాయి. మే 7న టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం తిరుమల ముఖచిత్రాన్నే మార్చివేయబోతోంది. ఏడుకొండల వాడి చెంత వేదాల ఘోష వినిపించడమే కాదు, ప్రతి అడుగులోనూ భక్తాగ్రేసరుల పేర్లు స్మరణకు వచ్చేలా టీటీడీ తిరుమలలోని ప్రధాన మార్గాలకు, సర్కిళ్లకు నామకరణం చేసింది.
ముఖ్యంగా స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు మాడవీధులు ఇకపై చతుర్వేదాలకు ప్రతీకలుగా నిలవనున్నాయి. తూర్పు మాడవీధి రుగ్వేద మార్గంగా, దక్షిణ మాడవీధి యజుర్వేద మార్గంగా, పశ్చిమ మాడవీధి సామవేద మార్గంగా, ఉత్తర మాడవీధి అధర్వణవేద మార్గంగా కొత్త రూపును సంతరించుకున్నాయి. ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతాన్ని సాళువ నరసింహరాయల ప్రాంగణంగా, ఆలయం ముందరి ఖాళీ ప్రదేశాన్ని విశిష్టాద్వైత ప్రవక్త భగవద్రామానుజాచార్య ప్రాంగణంగా నామకరణం చేస్తూ ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దారు. అలాగే దేవాలయ వెనుక భాగానికి అనంతాళ్వార్ ప్రాంగణం అని, సహస్ర దీపాలంకరణ సేవ జరిగే ప్రాంతానికి తిరుమలనంబి ప్రాంగణం అని పేర్లు స్థిరపరిచారు.
తిరుమలలోని ప్రధాన కూడళ్లు (సర్కిళ్లు) కూడా భక్త శిఖామణుల నామాలతో మెరిసిపోనున్నాయి. లేపాక్షి సర్కిల్ ఇకపై అన్నమయ్య కూడలిగా, రామ్‌బగీచ సర్కిల్ తొండమాన్ చక్రవర్తి కూడలిగా, ఎస్‌ఎంసీ సర్కిల్ పురందరదాసు కూడలి’గా పిలవబడతాయి. గెలుపు గుర్రాలుగా నిలిచే నందకం గెస్ట్‌హౌస్ సర్కిల్‌కు వకుళమాత కూడలి అని, జీఎన్‌సీ సర్కిల్‌కు గరుడాద్రి కూడలి అని నామకరణం చేయడం భక్తులలో భక్తి భావాన్ని మరింత పెంపొందించనుంది. రహదారుల విషయంలోనూ టీటీడీ అత్యంత శ్రద్ధ వహించింది. ఔటర్ రింగ్‌రోడ్డును తిరువేంకటపథంగా, ఇన్నర్ రింగ్‌రోడ్డును అన్నమాచార్య మార్గంగా మార్చడం విశేషం.
నిత్యకల్యాణ పచ్చతోరణంగా ఉండే ఆ కొండపై గోగర్భం డ్యామ్ వెళ్లే దారికి నిత్యకల్యాణ మార్గం అని, శ్రీవారి మెట్టు నడకదారికి శ్రీవారి మార్గం అని నామకరణం చేస్తూ భక్తుల సౌకర్యార్థం, ఆధ్యాత్మిక గుర్తింపు కోసం ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. చారిత్రక రాజులు, ఆళ్వార్లు, వేదాల పేర్లతో తిరుమల వీధులు ఇకపై కేవలం దారులుగా మాత్రమే కాకుండా, భక్తి మార్గాలుగా భక్తులను అలరించనున్నాయి. ఈ మార్పుతో తిరుమల యాత్ర మరింత అర్థవంతంగా, ఆధ్యాత్మిక శోభతో విలసిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh
May 08, 2026 12:57 PM IST













