[ad_1]
Last Updated:
Tirupati Crime: చిన్నపాటి మాటామాటా పెరిగి చివరకు ప్రాణాల మీదికి తెచ్చిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
ఒక అమ్మాయి విషయమై తలెత్తిన వివాదం కారణంగా ప్రాణస్నేహితుడే కాలయముడిగా మారి తోటి మిత్రుడిని బండరాయితో బాది అత్యంత పాశవికంగా హతమార్చాడు. శనివారం రాత్రి నాయుడుపేట పట్టణంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..స్థానిక సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించిన సమాచారం ప్రకారం.. తిరుపతి జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామానికి చెందిన బాలగోవిందు (20), హరి ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా సాన్నిహిత్యం కొనసాగుతోంది. అయితే, హరితో స్నేహంగా ఉండే ఒక అమ్మాయి గురించి బాలగోవిందు ఇటీవల తరచూ ప్రస్తావించేవాడు. శనివారం వీరిద్దరూ కలిసి ఓజిలి గ్రామానికి వెళ్లారు. తిరిగి వచ్చే మార్గమధ్యంలో సదరు అమ్మాయి గురించిన అంశం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. ఆ అమ్మాయి గురించి బాలగోవిందు అనుచితంగా, తప్పుగా మాట్లాడాడని హరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం శనివారం రాత్రి నాయుడుపేట పట్టణానికి చేరుకున్న వీరిద్దరూ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) వెనుక భాగంలో ఉన్న నిర్మానుష్యమైన ఖాళీ స్థలంలో మద్యం తాగేందుకు కూర్చున్నారు. మద్యం మత్తులోకి వెళ్లాక పాత వివాదం మళ్లీ మొదలైంది. పరస్పరం దూషించుకుంటూ ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి ఇద్దరూ కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన హరి, సమీపంలో పడివున్న ఒక పెద్ద బండరాయిని తీసుకుని బాలగోవిందు ముఖం, తలపై బలంగా మోదాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో బాలగోవిందు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మిత్రుడు చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితుడు హరి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
ఆదివారం వేకువజామున ఆ ప్రాంతంలో రక్తపుమడుగులో పడివున్న యువకుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. మృతుడు బాలగోవిందు తండ్రి గతంలోనే మరణించారని, తల్లి గీత కూలీనాలీ పనులు చేసుకుంటూ కొడుకును కష్టపడి పోషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా శవమై తేలడంతో తల్లి గీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు హరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
[ad_2]
Source link














