Last Updated:
Tirupati: తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ నిర్వహించి, పట్టపగలే చోరీలకు తెగబడుతున్న ఒక నిందితుడిని తిరుపతి తూర్పు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పక్కింట్లోనే నివాసముంటూ పక్కా పథకం ప్రకారం బంగారు నగలను దోచుకెళ్లిన యువకుడిని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తిరుపతి తూర్పు ఎస్సై రవిప్రకాశ్ మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతిలోని కొర్లగుంట అశోక్‌నగర్ ప్రాంతంలో కె. ఆశాజ్యోతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆమె ఆదివారం ఉదయం విధుల్లో భాగంగా ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా ప్రధాన ద్వారానికి వేసిన తాళం కనిపించలేదు. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి పరిశీలించగా, ఇంట్లోని బ్యాగ్‌లో దాచిపెట్టిన రూ. 1.87 లక్షల విలువైన 22 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా, బాధితురాలి పక్కింట్లోనే నివాసం ఉంటున్న వీరాపురం హరీష్ (19) ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. వడమాలపేటకు చెందిన హరీష్ కొంతకాలంగా తన తల్లితో కలిసి అశోక్‌నగర్‌లో ఉంటూ కార్లు క్లీనింగ్ చేసే పనితో జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. జల్సాలు, సరదాల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకనే పక్కింట్లో ఎవరూ లేని సమయం చూసి తాళం పగులగొట్టి నగలు దోచుకున్నట్లు హరీష్ అంగీకరించాడు.
విచారణలో మరో సంచలన విషయం కూడా వెలుగుచూసింది. గత నెల 21వ తేదీన ఇదే భవనం పైఅంతస్తులో నివసించే పద్మ అనే మహిళ ఇంట్లోనూ పగటిపూట తాళాలు పగులగొట్టి 17 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో రెండు చోరీలకు సంబంధించి హరీష్‌పై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రవిప్రకాశ్ తెలిపారు. పగటి వేళల్లో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.














