Last Updated:
వివాహ వార్షికోత్సవం రోజు ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ విధి వక్రించింది. ముద్దుల కొడుకుకు కొత్త బట్టలు తొడిగించి, ఆలయానికి తీసుకెళ్లిన తల్లిదండ్రుల సంతోషం కేవలం కొన్ని క్షణాలకే విషాదంగా మారిపోయింది.
వివాహ వార్షికోత్సవం రోజు ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ విధి వక్రించింది. ముద్దుల కొడుకుకు కొత్త బట్టలు తొడిగించి, ఆలయానికి తీసుకెళ్లిన తల్లిదండ్రుల సంతోషం కేవలం కొన్ని క్షణాలకే విషాదంగా మారిపోయింది. వేగంగా దూసుకొచ్చిన ఓ ఆటో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ముషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోలక్‌పూర్‌లోని గంగపుత్ర సంఘం సమీపంలో నివసించే మహేష్‌గౌడ్, సంతోషి దంపతులకు శ్రీయాన్ష్గౌడ్ (4) అనే కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. శనివారం వీరి వివాహ వార్షికోత్సవం కావడంతో ఉదయం కుటుంబమంతా ఆనందంగా గడిపింది. తన ముద్దుల కుమారుడికి కొత్త బట్టలు తొడిగించి, సమీపంలోని ఆలయానికి వెళ్లిన సంతోషి ప్రత్యేక పూజలు చేసింది.
పూజలు ముగించుకుని ఇంటి దగ్గర ఉన్న ఓ దుకాణం వైపు కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అటువైపు వేగంగా వచ్చిన ఓ ఆటో ఒక్కసారిగా బాలుడిని ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి చిన్నారి రోడ్డుపై పడిపోగా, ఆటో అతడి మీదగానే వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన శ్రీయాన్ష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కళ్ల ముందే కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన తల్లి సంతోషి గుండెలవిసేలా రోదించింది. కొన్ని నిమిషాల క్రితం వరకు నవ్వుతూ తన వెంట నడిచిన బిడ్డ ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తట్టుకోలేక విలపించింది. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆటో డ్రైవర్ మహ్మద్ అయూబ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న ఏసీపీ రణవీర్రెడ్డి, సీఐ రాజగోపాల్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన స్థానికులు, బీజేపీ నాయకులు భోలక్‌పూర్ హౌస్ సమీపంలో రాస్తారోకో చేపట్టారు. ఆ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న స్క్రాప్ దుకాణాల వల్ల భారీ వాహనాల రాకపోకలు పెరిగి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
పోలీసులు ఆందోళనకారులతో చర్చించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించారు. వివాహ వార్షికోత్సవం రోజు కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన చిన్నారి.. క్షణాల్లోనే మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవడం స్థానికులను కలచివేసింది. ఈ విషాద ఘటన భోలక్‌పూర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Hyderabad,Telangana













