Last Updated:
Train Viral Video: భక్తి, విశ్వాసం పేరుతో కొందరు చేసే పనులు పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించడమే కాదు వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. పక్కవాళ్లకు అసౌకర్యంగా ఉన్నప్పటికి తమలో ఉన్న భక్తిని నలుగురిలో చాటుకోవాలనే తపనో లేక నిత్య పూజలు చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే కరుణిస్తాడనే గుడ్డి నమ్మకమో తెలియదు కాని ఓ వ్యక్తి కదులుతున్న రైలులో ప్రయాణిస్తూ ఏసీ కోచ్‌లో అప్పర్ బెర్త్‌లో దీపారాధన వెలిగించి పూజలు చేశాడు.
Train Viral Video: భక్తి, విశ్వాసం పేరుతో కొందరు చేసే పనులు పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించడమే కాదు వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. పక్కవాళ్లకు అసౌకర్యంగా ఉన్నప్పటికి తమలో ఉన్న భక్తిని నలుగురిలో చాటుకోవాలనే తపనో లేక నిత్య పూజలు చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే కరుణిస్తాడనే గుడ్డి నమ్మకమో తెలియదు కాని ఓ వ్యక్తి కదులుతున్న రైలులో ప్రయాణిస్తూ ఏసీ కోచ్‌లో అప్పర్ బెర్త్‌లో దీపారాధన వెలిగించి పూజలు చేశాడు. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉండటం కాదు చూడటానికి కూడా అత్యంత ప్రమాదకరంగానే ఉంది. ఇండియన్ రైల్వేలో ఓ ప్రయాణికుడి చర్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై రైల్వేశాఖ సైతం స్పందించింది.
భక్తి ఉంటే భగవంతుడ్ని మనసులో ప్రార్ధించుకున్న సరిపోతుందనే కనీసం ఇంగితజ్ఞానం కూడా ఉండటం లేదు కొందరికి. నియమ, నిష్టలు పాటించాలనే ఆలోచనతో తాము ఎక్కడ ఉన్నామో.. తాము చేసే పని ఇతరులకు ఇబ్బంది కలుగుతుందో కూడా ఆలోచించడం లేదు. పక్కనున్న వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు అతిభక్తి కలిగిన వ్యక్తులు. రన్నింగ్ ట్రైన్‌లో ఓ ప్రయాణికుడు చేసిన దుస్సాహసం చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. తనతో పాటు ప్రయాణిస్తున్న వందలాది మంది భద్రతను విస్మరించి భక్తి పూనకంలో మునిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా ఏసీ కోచ్‌లోనే దీపం, అగరుబత్తీలు వెలిగించి పూజలు చేయడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. నిజంగా అలాంటి పని చేశారా అని ఆశ్చర్యపోకండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. అంతే కాదు భక్తి చాదస్తంతో చేసిన ఈపనిని ప్రతీ ఒక్కరూ తప్పు పడుతున్నారు. సదరు ప్రయాణికుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
🚆A video circulating on social media shows a passenger performing prayers on the upper berth of an AC train coach while lighting incense sticks and an oil lamp.
A fellow passenger reportedly intervened, explaining that such acts can be dangerous. Smoke may trigger the train’s… pic.twitter.com/79SrmBnAdW
— Jharkhand Rail Users (@JharkhandRail) July 26, 2026
అయితే ఈ ఘటన ఏ మార్గంలో జరిగిందో స్పష్టంగా తెలియడం లేదు. కాని ఇండియన్ రైల్ లో ప్రయాణస్తున్న ఓ వ్యక్తి ఏసీ కోచ్‌లో అప్పర్ బెర్త్ లో కూర్చొని హాయిగా ఇంట్లో పూజ గదిలో చేస్తున్నట్లుగా నూనె పోసి దీపం వెలిగించాడు. అగరుబత్తీలు వెలిగించి పూజ చేయడమే కాకుండా తోటి ప్రయాణకులు అరే బాబు నీ పూజలు ఆపు.. ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని అంటున్నపట్టించుకోలేదు. ఈ ప్రయాణికుడి వేషంలో ఉన్న భక్తుడి పూజతో బోగీ మొత్తం కొద్దిసేపట్లోనే పొగతో నిండిపోవడంతో ఇది గమనించిన తోటి ప్రయాణికుడు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడి వద్దకు వెళ్లి, కదులుతున్న రైల్లో నిప్పు వెలిగించడం ఎంత ప్రమాదకరమో వివరించి, వెంటనే ఆర్పేయాలని సూచించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.
సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో ‘ఝార్ఖండ్ రైల్ యూజర్స్’ అనే అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. బోగీలో వ్యాపించిన పొగ కారణంగా రైలు ఫైర్ అలారం మోగే ప్రమాదం ఉంది. అలాగే కదులుతున్న రైల్లో నిప్పును వెలిగించి ఉంచడం పెను అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది” అని హెచ్చరించారు. ముఖ్యంగా ఏసీ కోచ్‌లలో ఉండే పరుపులు, కర్టెన్లు, సీట్ల కుషన్లు వంటివి సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారని, ఇవి చాలా వేగంగా మంటలను అందుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగరుబత్తీల పొగకు ఆటోమేటిక్ స్మోక్ డిటెక్టర్లు యాక్టివేట్ అయి, రైలు ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌ను సైతం ఆన్ చేసే అవకాశం ఉంది.
వైరల్ అవుతున్న వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ స్పందించింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక ఫిర్యాదుల విభాగం ‘రైల్వే సేవా’ ఈ పోస్టుపై స్పందిస్తూ.. విచారణ ప్రారంభించేందుకు రైలు నంబర్, ప్రయాణ తేదీ, పీఎన్ఆర్ వంటి వివరాలు అందించాలని కోరింది. త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం ప్రయాణికులు నేరుగా ‘రైల్‌మదద్’ పోర్టల్ (railmadad.indianrailways.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
ట్రైన్‌లో పూజలు చేసిన వీడియో చూసి ప్రతీ నెటిజన్ రియాక్ట్ అవుతున్నారు. రైళ్లలో అగ్గిపెట్టెలు అమ్మడానికి కూడా వెండర్లను అనుమతించరు మరి ఇదేంటని కొందరు కామెంట్ చేస్తుంటే ఇంకొందరు నీ భక్తి పేరుతో తోటి ప్రయాణికుల ప్రాణాలు తీస్తావా ఏంటీ అని పోస్టులు పెడుతున్నారు. బోగీలో దీపం వెలిగించిన ప్రయాణికుడిపై భారీగా ఫైన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివి జరుగుతుంటే రైల్వే భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారని.. ఆర్పీఎఫ్ వెంటనే స్పందించే వీలుంటుంది కదా అని ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇంతకీ ఆ ప్రయాణికుడి వివరాలు తెలుసుకునే పనిలో రైల్వే అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Hyderabad,Telangana














