Last Updated:
అడ్డంగా దొరికిన పోలీస్.. నడిరోడ్డుపై చుక్కలు చూపించి ఆడేసుకున్న జనం!
హైదరాబాద్ నగరంలో ఒక ఎస్సై చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన పోలీస్ అధికారి, తన మైనర్ మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు. పబ్లిక్ రోడ్డుపై చిన్నారితో కారు నడిపిస్తూ అటుగా వెళ్తున్న వాహనదారులకు చిక్కాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, ఆయనను రోడ్డుపైనే నిలదీశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు పరిధిలోని గంధంగూడ-బైరాగిగూడ ప్రధాన రహదారిపై జులై 12 ఆదివారం రోజున ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన నార్సింగి పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ పూజారి తిరుపతిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 125, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 184, 180 కింద కేసులు నమోదు చేశారు.
ప్రధాన రహదారిపై ఒక కారు అత్యంత నెమ్మదిగా వెళ్తుండటంతో వెనుక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కారులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందేమో అని భావించిన ఒక ద్విచక్ర వాహనదారుడు ముందుకెళ్లి ఆరా తీశాడు. తీరా చూస్తే డ్రైవింగ్ సీట్లో ఒక చిన్నారి కూర్చుని కారు నడుపుతోంది. పక్కనే ఉన్న ప్యాసింజర్ సీట్లో ఆమె తాత కూర్చున్నాడు. ఈ దృశ్యం చూసిన సదరు వాహనదారుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే కారు ఆపి ఆ వ్యక్తిని ప్రశ్నించగా, అందులో ఉన్న చిన్నారి “మా నాన్న ఒక ఎస్సై” అంటూ బదులివ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
అప్పటికే అక్కడికి చేరుకున్న మిగతా వాహనదారులు, స్థానికులు కారును చుట్టుముట్టారు. చట్టాలను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీస్ అధికారి, ఇలా పసిపిల్లకు కారు డ్రైవింగ్ అప్పగించడంపై మండిపడ్డారు. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తారా అంటూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాల్సింది పోయి, ఆ ఎస్సై స్థానికులతో ఎదురుదాడికి దిగాడు. “ఇది ఆటో గేర్ కారు. డ్రైవింగ్ సీట్లో చిన్నారి ఉన్నప్పటికీ, నా పూర్తి కంట్రోల్లోనే కారు ఉంది” అంటూ ఆయన ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానం స్థానికులకు మరింత కోపం తెప్పించింది.
ఆ ఎస్సై తీరుతో విసుగెత్తిన ప్రజలు ఆయనకు చురుకు పుట్టేలా కౌంటర్లు ఇచ్చారు. ఆటో గేర్ అయితే మాత్రం చిన్న పిల్లలకు కారు ఇస్తారా అని ఒకరు నిలదీశారు. మీకు కనీస బుద్ధి లేదా, మోటారు నిబంధనల గురించి మీకు తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు డ్రైవింగ్ నేర్పించాలనుకుంటే పక్కనే ఉన్న ఖాళీ మైదానంలో నేర్పించుకోవాలి కానీ, పబ్లిక్ రోడ్డును మీ సొంత జాగీరులా వాడుకుంటారా అని మండిపడ్డారు. “ఒక కాలు బ్రేక్ మీద, మరో కాలు ప్యాసింజర్ సీట్లో పెట్టుకుని కార్లు నడుపుతారా? ఇదేనా మీ కంట్రోల్?” అంటూ మరో వ్యక్తి ఎస్సైని నిలదీశాడు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని తీవ్రంగా ప్రశ్నించారు.
స్థానికులు ఆ ఎస్సైని నిలదీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు సైతం ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. యూనిఫాంలో ఉన్నంత మాత్రాన చట్టం తమకు చుట్టం అనుకుంటే ఎలా అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన సామాన్యులపై వందల రూపాయల చలాన్లు వేసే పోలీసులు, తమ శాఖకు చెందిన వారు తప్పు చేస్తే ఎందుకు సమర్థిస్తున్నట్లు మాట్లాడతారని నిలదీస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సదరు ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Hyderabad,Telangana
Jul 13, 2026 12:12 PM IST












