Last Updated:
రాఘవ లారెన్స్ తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చారు. తాను తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి బరిలోకి దిగడం లేదని ప్రకటించారు. దీంతో త్రిషకు లైన్ క్లియర్ అయిందనే టాక్ నడుస్తోంది.
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చారు. దళపతి విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ తరపున ఆయన తిరుచ్చి ఈస్ట్ (Trichy East) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ఆ స్థానం నుంచి బరిలోకి దిగడం లేదని మంగళవారం విడుదల చేసిన వీడియోలో అధికారికంగా ప్రకటించారు.
తన వీడియో సందేశంలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. “విజయ్ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచి ఆయన కోసం గోడలపై పోస్టర్లు అతికించిన వీరాభిమానులు ఎంతోమంది ఉన్నారు. రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత టీవీకే కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిని కాదని, నేను తిరుచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం న్యాయం కాదు. నిజమైన కార్యకర్తలకు ఆ అవకాశం దక్కాలి. దీనిపై పార్టీ అధ్యక్షుడు విజయ్ సరైన నిర్ణయం తీసుకుంటారు” అని లారెన్స్ స్పష్టం చేశారు.
తాను కేవలం తిరుచ్చి ఈస్ట్ స్థానం గురించి మాత్రమే చెబుతున్నానని, ఇతర నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయనని తాను చెప్పడం లేదని లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు అనుభవించడానికి తాను రాజకీయాల్లోకి రావడం లేదని, కేవలం ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నానని ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తయిన తర్వాత, వీలైనంత త్వరగా తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.
రాఘవ లారెన్స్ తీసుకున్న ఈ ‘యూ టర్న్’ నిర్ణయంతో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పేరు రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి త్రిష టీవీకే తరపున పోటీ చేస్తుందని మొదట్లో బలంగా వార్తలు వినిపించాయి. మధ్యలో లారెన్స్ పేరు తెరపైకి రావడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఇప్పుడు లారెన్స్ స్వయంగా రేసు నుంచి తప్పుకోవడంతో.. త్రిషకు లైన్ పూర్తిగా క్లియర్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆ స్థానం నుంచి ఆమె పోటీ చేయడమే తరువాయి అని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













