Last Updated:
TTD Brahmotsavam: టీటీడీ నారాయణవనంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 28 నుంచి జూన్ 5 వరకు వైభవంగా, భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలతో నిర్వహించనుంది
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మే 28 నుంచి జూన్ 5 వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర బుధవారం తిరుపతిలోని ఈవో నివాస గృహ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, భక్తులకు దివ్యానుభూతి కలిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
సాంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఈ వేడుకలు జరగాలని, ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలు, సాంప్రదాయ పెయింటింగ్స్, రంగోలీలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. వేసవి దృష్ట్యా భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్ వంటి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తేలా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 27న అంకురార్పణం నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారు, అమ్మవారు వివిధ దివ్య వాహనాలపై భక్తులకు అనుగ్రహ దర్శనం ఇవ్వనున్నారు. మే 28న ధ్వజారోహణంతో పాటు పెద్దశేష వాహనం, మే 29న చిన్నశేష వాహనం, హంస వాహనం, మే 30న సింహ వాహనం మరియు ముత్యపుపందిరి వాహనం, మే 31న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం నిర్వహించనున్నారు. జూన్ 1న మోహినీ అవతారం, గరుడ వాహనం, జూన్ 2న హనుమంత వాహనం, గజ వాహనం, జూన్ 3న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం భక్తులను అలరించనున్నాయి. జూన్ 4న రథోత్సవం, అశ్వవాహనం, రాత్రి 8.30 గంటలకు వైభవంగా శ్రీ స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనుండగా, జూన్ 5న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ప్రత్యేకంగా జూన్ 4న నిర్వహించే శ్రీ స్వామివారి కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. దర్శనం, ప్రసాదాల పంపిణీ, కూర్చునే సదుపాయాలు, భద్రతా చర్యలు సమగ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













