UNGA: పగలు భద్రత.. రాత్రి ఉగ్రవాదం.. మీరా చెప్పేది నీతులు.. పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ | | ACTPnews

PC: X.com


Last Updated:

UNGA: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది.

PC: X.com
PC: X.com

ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, అసత్య ఆరోపణలను పదే పదే వల్లెవేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇలాగే కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఐరాసలో భారత ఫస్ట్ సెక్రటరీ పెటల్ గెహ్లాట్ రైట్ టు రిప్లై ద్వారా మాట్లాడుతూ, పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద చర్యలు కొనసాగితే భారత్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని, దానిని వినియోగించుకోవడానికి వెనుకాడబోమని తేల్చిచెప్పారు. అంతకుముందు సింధు జలాల ఒప్పందం అంశాన్ని షెహబాజ్ షరీఫ్ ప్రస్తావిస్తూ, పాకిస్థాన్‌కు దక్కాల్సిన నీటిని నిలిపివేసేందుకు లేదా మళ్లించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తామని బెదిరించిన నేపథ్యంలో భారత్ ఈ స్పందన తెలియజేసింది.

పగలు భద్రత గురించి మాట్లాడి.. రాత్రిపూట ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తారు

పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ పెటల్ గెహ్లాట్ 9/11 సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ప్రస్తావన తెచ్చారు. ప్రపంచాన్ని వణికించిన బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోని ప్రధాన మిలిటరీ అకాడమీకి సమీపంలోనే ఆశ్రయం పొందాడని గుర్తుచేశారు. “అలాంటి మిలిటరీని పాకిస్థాన్ ప్రతినిధి ఈ వేదికపై విపరీతంగా ప్రశంసించడం విడ్డూరం” అని అన్నారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల స్థితిగతులను ఆమె ఎత్తిచూపారు. సొంత ప్రజల నుంచే రక్షణ పొందేందుకు అక్కడి ప్రభుత్వం సెక్యూరిటీ వలయాల మధ్య పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ 27వ రాజ్యాంగ సవరణను, ఆ దేశ అసలైన పాలకుడికి కల్పించిన జీవితకాల రక్షణను ఆమె ప్రస్తావించారు. పాకిస్థాన్ పగటిపూట భద్రత గురించి మాట్లాడుతూ, రాత్రిపూట ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో మైనారిటీలను ఎలా చూస్తారో ప్రపంచం మొత్తానికి తెలుసని, మోసపూరిత తీపి మాటలతో అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టలేరని స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం

జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్ చేసిన ప్రకటనలను భారత్ పూర్తిగా తిరస్కరించింది. “జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని భాగం” అని గెహ్లాట్ పునరుద్ఘాటించారు. పీఓకే (PoK) లో జరుగుతున్న నిరసనలను ఉటంకిస్తూ.. కశ్మీర్ గురించి చర్చించాల్సి వస్తే పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావాలన్నారు. రావల్ కోట్ ప్రజలను అడిగితే అక్కడి హింస, హత్యలు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనల గురించి తెలుస్తుందని హితవు పలికారు.

పాకిస్థాన్ అనుసరిస్తున్న సీమాంతర ఉగ్రవాద విధానమే ఇరుదేశాల మధ్య ప్రధాన సమస్య అని గెహ్లాట్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఎక్కడా సురక్షిత ప్రాంతాలు ఉండవని భారత్ గతేడాదే నిరూపించిందని తెలిపారు. తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉందని, పాక్ వైపు నుంచి ఉగ్రవాదం కొనసాగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తీరు వల్ల ఇప్పటివరకు సద్భావనతో కొనసాగిన సంబంధాలు కూడా దెబ్బతింటాయని స్పష్టం చేశారు.

అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం కాదు

కేవలం పాక్ ప్రతినిధి మాటల ఆధారంగా కాకుండా, వారి చేతలను బట్టి ఐరాస ఆ దేశ విధానాలను అంచనా వేస్తుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. “ప్రతి ఏటా ఒకే అబద్ధాన్ని పదే పదే వల్లెవేసినంత మాత్రాన అది నిజం అయిపోదు” అని గెహ్లాట్ తేల్చిచెప్పారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న ఉగ్రవాదం, మోసం, ద్వంద్వ ప్రమాణాలు అటు పాకిస్థాన్‌కు గానీ, ఇటు ప్రపంచానికి గానీ ఎలాంటి మేలు చేయవని ఆమె ముగించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports