Last Updated:
ఈ దాడికి ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ప్రకటించింది.
US-Iran War: అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణిస్తున్న అమెరికా ఆర్మీకి చెందిన ‘AH-64 అపాచీ’ యుద్ధ హెలికాప్టర్‌ను ఇరాన్ దళాలు కూల్చివేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ దాడికి ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ దళాలు ఇరాన్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు ‘సెంట్కామ్’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ చర్యను అమెరికా “ఆత్మరక్షణ దాడులు” (Self-defense strikes) గా అభివర్ణించింది. హెలికాప్టర్ కూల్చివేతకు ఇరానే పూర్తి కారణమని, దానికి ప్రత్యక్ష సమాధానంగానే ఈ సైనిక చర్య చేపట్టామని స్పష్టం చేసింది.
“కమాండర్-ఇన్-చీఫ్ (అధ్యక్షుడు ట్రంప్) ఆదేశాల ప్రకారం.. నిన్న అమెరికా ఆర్మీ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతికారంగా, ఇరాన్‌పై అమెరికా దళాలు ఆత్మరక్షణ దాడులను ప్రారంభించాయి. ఇరాన్ చేసిన అనవసర దురాక్రమణకు ఈ మిషన్ ఒక తగిన సమాధానం.” అని పేర్కొంది. అయితే, ఈ దాడుల్లో ఇరాన్‌లోని ఏయే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు? ఎంతమేర నష్టం వాటిల్లింది? అనే వివరాలను సెంట్కామ్ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది.
సోమవారం హార్ముజ్ జలసంధి వద్ద గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ అపాచీ హెలికాప్టర్ కూలిపోయింది. ఇది ఒమన్ తీరంలో పడిపోగా.. అందులోని ఇద్దరు క్రూ మెంబర్లు (పైలట్లు) ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికా నౌకాదళానికి చెందిన మానవరహిత ఉపరితల నౌక (Unmanned Surface Vessel / Sea Drone) ద్వారా వారిని రక్షించారు. అమెరికా సైనిక చరిత్రలోనే ఇదొక సరికొత్త మరియు మొదటి రకపు రెస్క్యూ ఆపరేషన్ కావడం విశేషం.
మొదట హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని మిలిటరీ అధికారులు తెలిపినప్పటికీ.. ఆ తర్వాత ఇరాన్ దళాలే దీనిని కూల్చివేసినట్లు సైనిక కమాండర్లు తనకు సమాచారం ఇచ్చారని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అమెరికా ఖచ్చితంగా దీనికి బుద్ధి చెబుతుందని ఆయన ముందే హెచ్చరించారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒకవైపు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ఈ తాజా మిలిటరీ యాక్షన్ చోటుచేసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న చర్చలు “చివరి దశకు” చేరుకున్నాయని, మరికొద్ది రోజుల్లోనే ఒక సమగ్ర ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ అంతకుముందు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఈ తాజా ఘటనతో శాంతి చర్చలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది.
అమెరికా దాడుల ప్రకటనపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ అంతకుముందు మాట్లాడుతూ.. ఇరాన్ సరిహద్దుల సమీపంలో తిరిగే విదేశీ సైనిక దళాలకు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే విదేశీ దళాలు ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే ఏకైక మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు రవాణాలో సింహభాగం ఈ ‘హార్ముజ్ జలసంధి’ గుండానే సాగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది అత్యంత కీలకమైన జలమార్గం కావడంతో, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













