Last Updated:
Vande Mataram Bill: భారత జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ జెండాల తరహాలోనే.. జాతీయ గేయం ‘వందేమాతరం’ (National Song) గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
వందేమాతరం గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా లేదా దానిని ఆలపిస్తున్నప్పుడు అడ్డుకున్నా నేరంగా పరిగణించేలా ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ బిల్లు, 2026’ ను సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు గత మే నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం అమలులో ఉన్న 1971 నాటి చట్టం ప్రకారం.. జాతీయ గీతం, జాతీయ పతాకం, భారత రాజ్యాంగాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదంటే ఈ రెండూ విధించే నిబంధన ఉంది. తాజా సవరణ బిల్లు ద్వారా ఈ చట్ట పరిధిలోకి ‘వందేమాతరం’ గేయాన్ని కూడా తీసుకురానున్నారు. దీని ప్రకారం ఎవరైనా వందేమాతరం ఆలపించడాన్ని అడ్డుకున్నా లేదా అవమానపరిచే చర్యలకు పాల్పడినా మూడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
భారత స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం గేయం కీలక పాత్ర పోషించింది. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రచించిన ఈ గేయానికి 1950లో రాజ్యాంగ పరిషత్ ‘జాతీయ గేయం’ హోదాను కల్పించింది.
ఇటీవల ఫిబ్రవరి 2026లో కేంద్ర హోంశాఖ (MHA) అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారిక కార్యక్రమాల్లో ‘జనగణమన’తో పాటు వందేమాతరం యొక్క మొత్తం ఆరు చరణాలను తప్పనిసరిగా ఆలపించాలని, అంతేకాకుండా జాతీయ గీతం కంటే ముందే జాతీయ గేయాన్ని ప్లే చేయాలని నిర్దేశించింది. అయితే, గతంలో ఈ మార్గదర్శకాలకు కేవలం సలహా పూర్వక (Advisory) హోదా మాత్రమే ఉండటంతో ఉల్లంఘించినా ఎలాంటి శిక్షలు ఉండేవి కావు. తాజా సవరణ బిల్లుతో వీటికి గట్టి చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.
ఈ బిల్లు పార్లమెంట్‌లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది. గతంలో విపక్షాలు పాలించే కొన్ని రాష్ట్రాల్లో, మైనారిటీ సామాజిక వర్గాల ప్రతినిధుల నుంచి ఈ గేయ ఆలాపనపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షాలు దీనిపై మరింత విస్తృతమైన సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేస్తుండగా, దేశ జాతీయ ప్రతీకల గౌరవాన్ని కాపాడేందుకే ఈ బిల్లును తెస్తున్నట్లు అధికార పక్షం స్పష్టం చేసింది. జులై 20 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లుతో పాటు ఎఫ్‌సిఆర్‌ఎ (FCRA), బర్త్ అండ్ డెత్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ వంటి మరికొన్ని కీలక బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టనుంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














