Last Updated:
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. తాజాగా సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. తాజాగా సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మే 14వ తేదీన గ్రాండ్‌గా విడుదల కావాలి. అయితే, అనుకోని కారణాలు వల్ల ఇప్పటి వరకు షోలు పడలేదు. ఈ పరిణామం అటు అభిమానులను, ఇటు చిత్ర బృందాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన ఈ సినిమా విడుదల ఆగిపోవడంతో దర్శకుడు ఆర్జే బాలాజీ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను విడుదల చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య వంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడం, దానిని ఎంతో కష్టపడి పూర్తి చేయడం ఒక ఎత్తు అయితే.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఇలాంటి ఆటంకాలు ఎదురవ్వడం ఆయనను కృంగదీసింది.
‘ఈ అప్డేట్ ఇస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అభిమానులందరికీ నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ఉదయం 9 గంటల షో కోసం చాలా మంది ఎంతో దూరం ప్రయాణం చేసి థియేటర్లకు చేరుకున్నారు. కేరళ, తమిళనాడు సహా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారని నాకు తెలుసు. కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త ఉపశమనం కోసం సినిమాను ఆశ్రయిస్తాం. అలాంటిది థియేటర్ వరకు వచ్చిన తర్వాత షో క్యాన్సిల్ అయిందని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం’ అంటూ బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అంటే తెల్లవారుజామునే అభిమాన సంఘాల హడావుడి మొదలవుతుంది. కటౌట్లకు పాలాభిషేకాలు, టపాసుల మోతతో థియేటర్ల పరిసరాలు మారుమోగిపోతాయి. ‘వీరభద్రుడు’ సినిమా కోసం కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఏర్పాట్లు జరిగాయి. కానీ షోలు పడకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. ఈ పరిస్థితిని చూసి బాలాజీ చలించిపోయారు. సినిమా మే 14న విడుదలై ఘనవిజయం సాధిస్తుందని ఆయన ఎన్నో కలలు కన్నారు. అయితే ఆ ఆశలన్నీ అడియాసలు కావడంతో ఆయన తన బాధను ఆపుకోలేకపోయారు.
ఈ క్లిష్ట సమయంలో హీరో సూర్య సినిమా యూనిట్‌కు అండగా నిలుస్తున్నారు. సమస్యలను పరిష్కరించి సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావడానికి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల లోపు అన్ని చిక్కులు తొలగిపోతాయని, కచ్చితంగా షోలు ప్రారంభమవుతాయని ఆర్జే బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా మంది సినీ ప్రముఖులు, టెక్నీషియన్లు ఈ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













