Last Updated:
టీజీ20 లీగ్ వివాదం నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ అనుమతి లేకుండా టోర్నీ నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీజీ20 లీగ్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడ్డాయి.
టీజీ20 లీగ్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోలేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో లీగ్‌కు ప్రచారం చేస్తున్న ప్రముఖులపై కూడా టీసీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.
టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటి, క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయుడులకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. బీసీసీఐ అనుమతి లేకుండానే ఈ టోర్నీ నిర్వహిస్తున్నారని, అలాంటి టోర్నీకి ప్రముఖులు మద్దతు ఇవ్వడం సరైంది కాదని టీసీఏ అభిప్రాయపడుతోంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రారంభిస్తున్న తొలి టీజీ20 లీగ్‌కు విజయ్ దేవరకొండను అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. దీంతో ఆయన పేరు కూడా ఈ వివాదంలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గానీ, ఆయన బృందం గానీ ఈ నోటీసులపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం తన రాబోయే సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న చారిత్రక యాక్షన్ డ్రామా ‘రణబలి’తో పాటు ‘రౌడీ జనార్ధన’ చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ‘రణబలి’ సినిమాలో ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల తర్వాత ఈ జంట మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘రణబలి’ చిత్రం 2026 సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక క్రికెట్ లీగ్ వివాదంపై విజయ్ దేవరకొండ ఎలాంటి స్పందన ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













