తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విభేదాలు నెలకొన్నాయన్న వార్తలు గత కొంతకాలంగా తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో భర్త నుంచి విడాకులు కోరుతూ సంగీత చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద దాఖలైన ఈ పిటిషన్పై కోర్టు పలుమార్లు విచారణ చేపట్టింది. తొలుత ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించినా, ఏప్రిల్ 20, జూన్ 15 తేదీల్లో విజయ్, సంగీత ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఇరువర్గాల న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 7న జరిగిన ఆన్లైన్ విచారణలో లండన్లో ఉన్న సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై సుమారు 20 నిమిషాల పాటు తన వాదనలు వినిపించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.














