Last Updated:
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. తాంత్రిక పూజల పేరుతో ఇద్దరు వ్యక్తులు శ్మశానవాటికలో కాలుతున్న చితిపైనే మాంసం వండారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రిక పూజల పేరుతో కొందరు దుర్మార్గులు శ్మశానవాటికలో ఏకంగా కాలుతున్న మృతదేహం చితిపైనే మాంసం వండుతూ పట్టుబడ్డారు. మూఢనమ్మకాలతో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి సమయంలో స్థానిక శ్మశానవాటికలో ఓ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసి కుటుంబ సభ్యులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు.
ఇంకా మండుతున్న ఆ చితి మంటలపైనే ఓ గిన్నె పెట్టి అందులో మాంసం వండటం మొదలుపెట్టారు. చేతబడి, తాంత్రిక పూజల్లో భాగంగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్పష్టమైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు ఈ వింత దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన శ్మశానవాటికకు చేరుకున్న పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అక్కడున్న పూజా సామగ్రి, కాలుతున్న చితిపై ఉన్న మాంసం గిన్నెను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు తాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నామని, అతీంద్రియ శక్తులు సంపాదించేందుకే ఈ దారుణానికి ఒడిగట్టామని అంగీకరించినట్లు సమాచారం.
ఈ వికృత ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగకుండా ఇలాంటి నీచమైన పూజలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించే ముఠాలు ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిందితులపై మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం, మృతదేహాలను అవమానించడం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. సమాజం ఎంత ఆధునికంగా మారుతున్నా, ఇలాంటి అమానుష ఘటనలు ఇంకా జరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.














