Viral Video: సినిమాను తలపించిన ఛేజింగ్.. కారు టాప్‌పై 40 కి.మీ వేలాడుతూ గుట్కా స్మగ్లర్లను పట్టించిన పోలీస్! | | ACTPnews

News18


Last Updated:

తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి సినిమా స్టైల్‌లో స్మగ్లర్లను పట్టుకున్నారు. వేగంగా వెళ్తున్న కారు పైకప్పుపై 40 కిలోమీటర్ల దూరం వేలాడుతూ ప్రయాణించి, 300 కిలోల నిషేధిత గుట్కా తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయించారు.

News18
News18

తమిళనాడులోని కోయంబత్తూరులో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించే రీతిలో ఓ పోలీసు అధికారి ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. నిషేధిత గుట్కా తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు ఏకంగా వేగంగా దూసుకెళ్తున్న కారు పైకప్పు (రూఫ్ టాప్) మీద దాదాపు 40 కిలోమీటర్ల దూరం వేలాడుతూ ప్రయాణించారు. కోయంబత్తూరు సమీపంలోని కోవిల్‌పాళయం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విళాంకురిచ్చి ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఎస్‌ఐ విఘ్నేష్, హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల సమయంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఓ కారు వెనుక భాగంలో అనుమానాస్పద గోనె సంచులు కనిపించడంతో పోలీసులు ఆపారు.

ఎస్‌ఐ విఘ్నేష్ ఆ సంచులను తనిఖీ చేయబోతుండగా, కారులోని ముగ్గురు వ్యక్తులు పోలీసులను పక్కకు తోసేసి డోర్లు లాక్ చేసుకుని వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ కారును ఆపే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ అత్యంత వేగంగా స్పందించి కదులుతున్న కారు పైకప్పుపైకి దూకారు. కిందకు దూకితే చక్రాల కింద పడే ప్రమాదం ఉండటంతో ఆయన కారు టాప్‌ను గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోయారు.

కారుపై పోలీసు అధికారి వేలాడుతున్నప్పటికీ నిందితులు ఏమాత్రం కనికరం లేకుండా వాహనాన్ని అతివేగంగా నడిపారు. కాళపట్టి, సిత్రా రద్దీ రహదారుల మీదుగా కొచ్చి-సేలం జాతీయ రహదారిపై ఉన్న కనియూర్ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లించి బ్యారియర్ దాటగానే మరింత వేగంగా కారును పోనిచ్చారు. కారు టాప్‌పై ప్రమాదకర స్థితిలో వేలాడుతున్న వేల్మురుగన్‌ను చూసిన ఇతర వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కరుమత్తంపట్టి, కనియూర్, అవినాశి పోలీసులు తక్షణమే అప్రమత్తమై ఆ కారును వెంబడించారు. పోలీసు వాహనాలతో పాటు కనియూర్, ఎల్జీ ఆస్పత్రి, బాలా ఆర్థో ఆస్పత్రి, స్నేహం సంస్థలకు చెందిన అంబులెన్సులు సైతం ఈ ఛేజింగ్‌లో భాగమయ్యాయి. సుమారు 40 కిలోమీటర్ల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత ఛేజింగ్ తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని అన్నపూర్ణ హోటల్ సమీపంలో ముగిసింది. పోలీసు వాహనాలు, అంబులెన్సులు నలువైపులా చుట్టుముట్టి స్మగ్లర్ల కారును దిగ్బంధించాయి.

కారు ఆగగానే అందులోని ఇద్దరు నిందితులు పరారవ్వగా, ఒకరిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అవినాశి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పారిపోయిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు రాజస్థాన్‌కు చెందిన బాబు ధారా (27), రాజేష్ (23), సురేష్ (20) అని తేలింది. వీరు బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు కారులో అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల నిషేధిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలకు తెగించి ముఠాను పట్టించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్‌తో పాటు పోలీసులకు సహకరించిన అంబులెన్స్ సిబ్బందిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports