Last Updated:
తిరుమలలో భక్తుల కోసం టీటీడీ పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఆధునిక మ్యూజియంను ఏర్పాటు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో శ్రీవారి వైభవం, తిరుమల చరిత్రను 3డీ, వర్చువల్ రియాలిటీతో తెలుసుకోవచ్చు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూసే భక్తులకు ఇక ఆ సమయం మరింత ప్రత్యేకంగా మారనుంది. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో నిరీక్షించే సమయాన్ని కేవలం వేచి ఉండే సమయంగా కాకుండా.. ఆధ్యాత్మికత, జ్ఞానాన్ని పెంచుకునే సమయంగా మార్చేందుకు టీటీడీ కొత్తగా పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సెంటర్ ద్వారా భక్తులకు తిరుమల, శ్రీవారి వైభవం గురించి సరికొత్త అనుభూతిని అందించనున్నారు.
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్‌నే పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దారు. శుక్రవారం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకటయ్య చౌదరి ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు ఈ సెంటర్‌ను పరిశీలించారు. సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సెంటర్‌ను ప్రారంభించినట్లు అదనపు ఈవో తెలిపారు.
భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణాలు, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలను 3డీ, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వర్చువల్ రియాలిటీ కంటెంట్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో స్వామివారి కథలు, భక్తుల అనుభవాలు, ఆలయ నిర్మాణం, చరిత్ర, పరిపాలన, సేవలు, పురాణాలు, దాతల సేవలు తదితర అంశాలపై నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించి ఎప్పటికప్పుడు ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను కూడా టీటీడీ ఆధునీకరిస్తోంది. దాదాపు 14 గ్యాలరీలతో మ్యూజియంను ప్రత్యేక థీమ్‌లతో తీర్చిదిద్దినట్లు అదనపు ఈవో తెలిపారు. ఆలయ చరిత్ర, తిరుమల వారసత్వం, పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులను భక్తులు ఆసక్తిగా తెలుసుకునేలా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మ్యూజియం నిర్వహణ కోసం ప్రత్యేక మాన్యువల్, ఎస్ఓపీని రూపొందిస్తున్నామని.. సీసీ కెమెరాలు, సిబ్బంది, గైడ్ల సేవలు, భద్రత, కళాఖండాలకు ప్రత్యేక నంబరింగ్ వంటి అంశాలను అందులో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మ్యూజియంను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
శ్రీవారి దర్శనంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక, జ్ఞానదాయక అనుభూతిని అందించడమే టీటీడీ లక్ష్యమని అదనపు ఈవో పేర్కొన్నారు. ఎక్స్పీరియన్స్ సెంటర్, మ్యూజియం ద్వారా భక్తులు తిరుమల చరిత్ర, ఆలయ విశిష్టత, స్వామివారి సేవలు, సంప్రదాయాలను మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులను పరిశీలించిన మీడియా ప్రతినిధులు తెలుగు కంటెంట్‌ను మరింత పెంచాలని, కంటెంట్‌ను తరచూ మార్చాలని, భిన్నమైన అంశాలను అందించాలని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని కంటెంట్, నిర్వహణ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.














