Last Updated:
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్‌లో ప్రజలకు కల్పించిన ఇంధన సదుపాయం మానవ చరిత్రలోనే అద్భుతమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కొనియాడారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంలోనూ భారత్ ఇంధన కొరత లేకుండా స్థిరంగా నిలబడటంపై ప్రశంసలు కురిపించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ పాలనలో భారతదేశంలో సామాన్య ప్రజలకు అందించిన ఇంధన సదుపాయం మానవ చరిత్రలోనే ఏ దశాబ్దంలోనూ, ఏ ప్రాంతంలోనూ, ఏ ఇతర దేశంలోనూ జరగలేదని ఆయన కొనియాడారు. ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న అల్బనీస్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు రోజురోజుకూ మరింత బలపడుతున్నాయని, ప్రధాని మోదీతో తమ దేశానికి అత్యంత దృఢమైన అనుబంధం ఉందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సౌభాగ్య పథకం ద్వారా కోట్లాది ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు, ఉజ్వల యోజన ద్వారా పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లు అందించిన విప్లవాత్మక మార్పులను ఆయన అంతర్జాతీయ వేదికపై గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభం దెబ్బకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు తీవ్ర ఇంధన కొరతతో అల్లాడుతున్నాయి. అయితే భారత్ మాత్రం ముందుచూపుతో వ్యవహరించి ఎలాంటి కొరత లేకుండా స్వల్ప ధరల పెరుగుదలతోనే స్థిరమైన ఇంధన సరఫరాను కొనసాగిస్తోంది.
NEW: “To give PM Modi credit, more people have been given access to energy in India under his reign that any decade, or any region or any country in all of human history,” says Australia Prime Minister Albanese pic.twitter.com/seR82GuPVs
— Shashank Mattoo (@MattooShashank) September 26, 2026
గతంలో కేవలం 27 దేశాల నుంచి మాత్రమే చమురు దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు ఆ సంఖ్యను 41 దేశాలకు విస్తరించినట్లు ప్రధాని మోదీ గత మే నెలలో లోక్‌సభ వేదికగా వెల్లడించారు. ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి ఇంధనాన్ని సేకరించడం వల్లే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడగలుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసుపై పడే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల నుంచి చమురు కొనుగోళ్లు నిరంతరం కొనసాగిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.














