Last Updated:
హైదరాబాద్ యూసుఫ్‌గూడలో సరితకు రాంగ్ కాల్ చేసిన విఘ్నేష్ అనే నకిలీ డాక్టర్, ఫోన్ వాట్సాప్ ద్వారా అశ్లీల వేధింపులు, సరిత ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు
ఆ ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని ప్రశాంతత లేకుండా చేస్తుందని ఆ మహిళ ఊహించలేదు. స్నేహితురాలికి చేయబోయి.. పొరపాటున పడిన ఆ రాంగ్ నెంబర్, ఆమెకు ఒక పీడకలలా మారింది. డాక్టర్ ముసుగులో ఉన్న ఒక కీచకుడు ఆమెను మానసికంగా వేధిస్తూ నరకం చూపించిన ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన సరిత అనే మహిళ, భర్త చనిపోవడంతో కుటుంబ భారాన్ని భుజాన వేసుకుంది. లేడీస్ టైలర్‌గా పనిచేస్తూ ఎంతో కష్టపడి గౌరవంగా జీవనం సాగిస్తోంది. అయితే, కొన్ని రోజుల క్రితం ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేయబోయి, పొరపాటున ఒక నెంబర్ తప్పుగా డయల్ చేసింది.
అవతలి వైపు నుంచి ఫోన్ ఎత్తిన వ్యక్తి తన పేరు విఘ్నేష్ అని, తాను ఒక డాక్టర్ అని పరిచయం చేసుకున్నాడు. పొరపాటున ఫోన్ చేశానని సరిత చెప్పినా ఆ నరరూప రాక్షసుడు వదిలిపెట్టలేదు. అప్పటినుంచి ఆమె నెంబర్‌కు నిరంతరం కాల్స్ చేయడం, వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు.
మెల్లగా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిన ఆ నకిలీ డాక్టర్.. సరితతో అత్యంత అసభ్యకరంగా మాట్లాడడం ప్రారంభించాడు. లైంగిక వాంఛను వ్యక్తపరుస్తూ, అశ్లీల సందేశాలు పంపుతూ బరితెగించాడు. సరిత తీవ్రంగా మందలించినా, తన నెంబర్‌కు ఫోన్ చేయొద్దు అని గట్టిగా హెచ్చరించినా ఆ కీచకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజురోజుకూ అతని మానసిక వేధింపులు మితిమీరిపోయాయి.
చివరకు ఆ సైకో వేధింపులను భరించలేక, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన దారుణాన్ని వివరించడంతో పోలీసులు తక్షణమే స్పందించి, నిందితుడు విఘ్నేష్‌పై కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఆ రాంగ్ నెంబర్ కీచకుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Hyderabad,Hyderabad,Telangana
May 21, 2026 10:52 PM IST













