Last Updated:
టీటీడీ తిరుపతి శ్రీ వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం ప్రారంభం, చిన్నారుల అక్షరాభ్యాసానికి ఉచిత కిట్లు, హెచ్డీపీపీ నిర్వహణలో సనాతన ధర్మ, సంస్కృతి అవగాహన లక్ష్యం
చిన్నారుల జీవితంలో విద్యారంభం అనేది అత్యంత పవిత్రమైన, మరపురాని ఘట్టం. ఆ తొలి అడుగును భక్తి, సంస్కృతి, సనాతన విలువలతో మేళవించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ‘అక్షర గోవిందం’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలపగా, తిరుపతిలోని శ్రీ వకుళమాత ఆలయాన్ని దీనికి వేదికగా ఎంపిక చేసింది.
అక్షరాభ్యాసం కోసం ఆలయానికి వచ్చే చిన్నారులకు ప్రత్యేకంగా రూపొందించిన ‘అక్షర గోవిందం’ కిట్లను ఉచితంగా అందించనున్నారు. విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే ఈ పవిత్ర సందర్భాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. చిన్నారులు తొలి అక్షరాన్ని దిద్దే క్షణం నుంచే ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అనుబంధం పెంపొందేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు కేవలం విద్యనే కాకుండా భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా టీటీడీ పేర్కొంది. వేద సంప్రదాయాలకు అనుగుణంగా విద్యారంభాన్ని ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మలచాలని భావిస్తోంది.
ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా హెచ్డీపీపీకి అప్పగిస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. కిట్ల తయారీ, పంపిణీతో పాటు కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన అన్ని ఖర్చులను కూడా హెచ్డీపీపీ నిధుల నుంచే భరించనుంది. గతంలో ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ద్వారా అమలు చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో హెచ్డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఇప్పటికే వకుళమాత ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. వేలాది మంది చిన్నారులకు ఉచితంగా విద్యారంభ కిట్లు అందిస్తూ, భక్తి మరియు విద్యను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోంది. ‘అక్షర గోవిందం’ కార్యక్రమం ద్వారా చిన్నారుల భవిష్యత్తులో జ్ఞానదీపం వెలిగించడంతో పాటు, సనాతన ధర్మ విలువలను తదుపరి తరాలకు చేరవేసే మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లైంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh













