రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్‌లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews

రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్‌లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్!


Last Updated:

హైదరాబాద్‌లో నివసిస్తున్న వారికి తీపికబురు. ప్రభుత్వం రూ.7,360 కోట్లు కేటాయించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్‌లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్!
రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్‌లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్!

హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్తులో గుక్కెడు నీటికి కటకట రాకూడదు.. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపరచాలి అనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం భారీ నిధులతో ముందుకొచ్చింది. గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 ప్రాజెక్టుల కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు (HMWSSB) ఏకంగా రూ. 7,360 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సర్కార్ నడుం బిగించింది.

సియాసాత్ డెయిలీ కథనం ప్రకారం.. రాబోయే రోజుల్లో తాగునీటికి ఎక్కడా లోటు రాకుండా అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2027 నాటికి నగరంలో నీటి డిమాండ్ ఏకంగా 835 ఎంజీడీలకు చేరుకుంటుందని అంచనా వేశారు. తద్వారా సుమారు 233 ఎంజీడీల నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వాటర్ బోర్డు ప్రభుత్వానికి స్పష్టంగా వివరించింది. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల జలాలను హైదరాబాద్‌కు తరలించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల నగరానికి అదనంగా 300 ఎంజీడీల తాగునీరు అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనానికి సైతం 2.5 టీఎంసీల నీటిని ప్రత్యేకంగా వినియోగించనున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం..

తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, భూగర్భ జలాల పరిరక్షణపై మంత్రులు మహ్మద్ అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో మురుగునీటి నిర్వహణ కోసం భారీగా నిధులు కేటాయించారు. మొత్తం 972 ఎంఎల్‌డీల సామర్థ్యంతో 39 మురుగునీటి శుద్ధి కేంద్రాలను (STP) అత్యాధునిక సాంకేతికతతో నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 3,850 కోట్లను ఆమోదించింది. ఈ మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణంతో పర్యావరణ పరిరక్షణ జరగడంతో పాటు నగరం ఎంతో పరిశుభ్రంగా మారుతుంది.

ఇది కూడా చదవండి: Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు!

నీటి సరఫరా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు పలు భారీ ప్రాజెక్టులకు మంత్రులు పచ్చజెండా ఊపారు. రూ. 722 కోట్లతో మంజీరా నీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించే పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఉస్మాన్ సాగర్ కాండ్యూట్ వ్యవస్థ పునరుద్ధరణతో పాటు అదనంగా 21 ఎంజీడీల పైప్‌లైన్ నిర్మాణానికి ప్రణాళికలు పక్కాగా సిద్ధం చేశారు. వీటితో పాటు కోకాపేట నియోపోలిస్‌లో రూ. 298 కోట్లతో చేపట్టిన వాటర్ సప్లై ప్రాజెక్టు పనులను సమీక్షించారు. మహేంద్ర హిల్స్, అస్మాన్‌గఢ్ ప్రాంతాల్లో రూ. 30 కోట్ల వ్యయంతో చేపడుతున్న జీఎల్‌ఎస్‌ఆర్ నిర్మాణ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించి, నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు.

పాతబస్తీ అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కీలక పనులు చేపట్టింది. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు ముమ్మరం చేసింది. రూ. 301 కోట్ల వ్యయంతో సుమారు 156 కిలోమీటర్ల మేర సీవరేజ్ లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ పనుల్లో 20 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా వేల కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న ఈ బృహత్తర ప్రాజెక్టులన్నీ పూర్తయితే, హైదరాబాద్ నగరవాసులకు భవిష్యత్తులో దశాబ్దాల పాటు తాగునీరు, మురుగునీటి సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *