త్రిషపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. సీఎం విజయ్ ఒక ‘డమ్మీ’: ఉదయనిధి స్టాలిన్ ఫైర్! | | ACTPnews

News18


Last Updated:

నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తంజావూరు పోలీసుల విచారణ ఎదుర్కొన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తన వాదన వినిపించారు. తాను కేవలం రైతుల సమస్యలపైనే మాట్లాడానని, సీఎం విజయ్ ఒక డమ్మీ అని తీవ్ర విమర్శలు చేశారు.

News18
News18

తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై తానెలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తంజావూరులోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌లో దాదాపు 90 నిమిషాల పాటు పోలీసుల విచారణ ఎదుర్కొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారంలో విఫలమైందన్న నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికే టీవీకే (TVK) ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని ఆరోపించారు. ఒక తీవ్రవాదిలా తనను విచారణకు తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కును ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. తాను మాట్లాడని మాటలను సైతం కట్ చేసి, మార్ఫింగ్ చేసి తప్పుడు కేసు బనాయించారని ఉదయనిధి తీవ్రంగా విమర్శించారు.

సీఎం విజయ్ ఒక డమ్మీ ముఖ్యమంత్రి

గత మూడు నెలలుగా ఒక్కో మంత్రి ఏం చేస్తున్నారో ఆధారాలతో సహా తాను ప్రశ్నించానని ఉదయనిధి చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి విజయ్ ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కేవలం ఒక “డమ్మీ సీఎం” అని, పాలన చేతకాని అసమర్థుడని ధ్వజమెత్తారు. కావేరీ జలాల సమస్యపై తక్షణమే సర్వపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాను డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేవలం రైతుల ప్రయోజనాల కోసమే తాను మాట్లాడానని, ఏ నటి గురించీ తప్పుగా మాట్లాడలేదని తేల్చి చెప్పారు.

చట్టపరంగానే ఎదుర్కొంటా

ఈ తప్పుడు కేసును న్యాయస్థానంలోనే చట్టపరంగా ఎదుర్కొంటానని ఉదయనిధి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలందరూ తమ పార్టీ అధినేతను కలవనున్నట్లు వెల్లడించారు. విచారణ ముగించుకుని బయటకు వచ్చిన ఉదయనిధికి పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా తరలివచ్చిన డీఎంకే కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తమ గొంతు నొక్కలేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ప్రభుత్వ తీరుపై విమర్శలు

మరోవైపు ఈ ఘటనపై నటి మరియా జూలియానా స్పందిస్తూ టీవీకే ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తోందని, ఉదయనిధి వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి బూటకపు కేసు పెట్టారని విమర్శించారు. పూర్తిగా రైతుల డిమాండ్లపై సాగిన ప్రసంగాన్ని రాజకీయం చేయడం తగదని డీఎంకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయపోరాటం ద్వారానే ఈ కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *