Last Updated:
అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘రూపాయనమః’. నూతన దర్శకుడు అరవింద్ రెడ్డి దర్శకత్వంలో, చిత్ర వేద ప్రొడక్షన్స్ పతాకంపై పావని సాగి నిర్మించిన ఈ పల్లెటూరి సస్పెన్స్ కామెడీ డ్రామా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో సహజత్వానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కే గ్రామీణ నేపథ్య కథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎలాంటి భారీ హంగులు, ఆర్భాటాలు లేకుండా స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల అమాయకత్వం, భావోద్వేగాల చుట్టూ అల్లిన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంటాయి. సరిగ్గా ఇదే కోవలో అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘రూపాయనమః’. నూతన దర్శకుడు అరవింద్ రెడ్డి దర్శకత్వంలో, చిత్ర వేద ప్రొడక్షన్స్ పతాకంపై పావని సాగి నిర్మించిన ఈ పల్లెటూరి సస్పెన్స్ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
హరి నారాయణ తన తల్లి, భార్య, కూతురితో కలిసి పల్లెటూరిలో చాలా సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారంతో సతమతమవుతున్న అతని జీవితంలోకి అనుకోకుండా ఒక లాటరీ రూపంలో అదృష్టం తలుపు తడుతుంది. అతడు సరదాగా కొన్న ఒక లాటరీ టికెట్‌కు ఏకంగా ఒక కోటి రూపాయల భారీ బహుమతి వస్తుంది. ఇక తమ కష్టాలన్నీ తీరిపోయాయని, జీవితం మారిపోయిందని ఆ కుటుంబం సంబరపడేలోపే ఒక ఊహించని సమస్య ఎదురవుతుంది. కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఆ లాటరీ టికెట్ ఇంట్లో అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది.
కుటుంబ సభ్యులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇల్లంతా జల్లెడ పడుతున్న సమయంలో, హరికి ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. తప్పిపోయిన ఆ లాటరీ టికెట్ తన దగ్గరే ఉందని, దాన్ని తిరిగి ఇవ్వాలంటే పది లక్షల రూపాయలు తనకు ఇవ్వాలని ఆ అపరిచితుడు బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అసలు ఆ అపరిచితుడు ఎవరు? అతనికి ఆ టికెట్ ఎలా దొరికింది? పది లక్షలు డిమాండ్ చేస్తున్న ఆ వ్యక్తిని పట్టుకుని హరి తన లాటరీ టికెట్‌ను ఎలా దక్కించుకున్నాడు? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో మిగతా కథ నడుస్తుంది.
ఒక్కసారిగా భారీ మొత్తం చేతికి వస్తుందనే ఆశ, అది చేజారినప్పుడు కలిగే ఆందోళన మానవ సహజమైన లక్షణాలు. ఈ పాయింట్‌ను దర్శకుడు అరవింద్ రెడ్డి పల్లెటూరి వాతావరణంలో చాలా సహజంగా, కన్విన్సింగ్‌గా నడిపించారు. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు, ఊరి జనం ప్రవర్తన, వారి అమాయకత్వం ఎలాంటి నాటకీయత లేకుండా స్వచ్ఛంగా సాగుతాయి. ప్రధాన పాత్రల్లో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ చాలా న్యాచురల్ గా నటించారు. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే సామాన్యుడి పాత్రలో అరవింద్ పండ్రాతే తనలోని ఆందోళనను, నిస్సహాయతను అద్భుతంగా పండించాడు. శ్రావణి మల్కాని, వేణు పోల్సాని, డి. అనుదీప్, క్రాక్ శ్రీమణి, విషన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించి సినిమాకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చారు.
సెకండాఫ్ లో కథ ఇంటి నుంచి ఊరి పరిసరాల్లోకి విస్తరించినప్పుడు కథనం వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా హరికి, ఆ అపరిచితుడికి మధ్య సాగే ఫోన్ సంభాషణలు, ఎత్తుకు పైఎత్తులు ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీని రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా చాలా లాజికల్ గా, సంతృప్తికరంగా ముగుస్తాయి. టెక్నికల్ పరంగా చూస్తే.. జింకా వరుణ్ నాయుడు కెమెరా పనితనం గ్రామీణ లొకేషన్లను ఎక్కడా కృత్రిమత్వం లేకుండా వాస్తవికంగా బంధించింది. రిషి ఎం అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను, హాస్యాన్ని ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయింది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగుంది.
అయితే కథలోని ప్రధాన సమస్య మొదలయ్యే వరకు ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఇంట్లో జరిగే వెతుకులాట సన్నివేశాలను ఎడిటర్ ఇంకొంత క్రిస్పీగా కట్ చేసి ఉంటే కథనంలో మరింత వేగం ఉండేది. అలాగే బడ్జెట్ పరిమితులు కొన్ని చోట్ల తెరపై స్పష్టంగా కనిపిస్తాయి. ఏదేమైనప్పటికీ, ఒక ఆసక్తికరమైన పాయింట్‌తో, పల్లెటూరి స్వచ్ఛమైన హాస్యంతో తెరకెక్కిన ఈ చిత్తశుద్ధి గల చిన్న చిత్రం ప్రేక్షకులను నిరాశపరచదు. సహజమైన గ్రామీణ వాతావరణం, వినోదంతో కూడిన థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌లో ‘రూపాయనమః’ చిత్రాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
రేటింగ్: 2.75














