Last Updated:
Indonesia: ఇండోనేషియాలోని ప్రసిద్ధ అగ్నిపర్వతం ‘అనక్ క్రాకటోవా’ (Anak Krakatau) ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా బద్దలైంది.
దీంతో పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో భారీగా అగ్నిపర్వత బూడిద అలముకుంది. ఈ పరిణామం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జకార్తాలోని సోకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బూడిద దట్టంగా వ్యాపించడంతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండోనేషియా ప్రధాన ద్వీపాలైన జావా, సుమత్రాల మధ్య ఉన్న సుందా జలసంధిలో ఈ అగ్నిపర్వత ద్వీపం ఉంది. శుక్రవారం నుంచే ఇక్కడ కార్యకలాపాలు పెరిగినట్లు భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున 3:53 గంటలకు దాదాపు 30 సెకన్ల పాటు ఈ విస్ఫోటనం సంభవించింది. అక్కడి నిఘా కెమెరాల్లో అగ్నిపర్వతం నుంచి లావా వెలువడటం రికార్డయింది. సమీప గ్రామాలు 16 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, ఖాళీ చేయాలని కూడా ఆదేశించలేదు. అయితే, బిలం నుంచి కనీసం 3 కిలోమీటర్ల మేర దూరంగా ఉండాలని ప్రజలను, పర్యాటకులను అధికారులు హెచ్చరించారు.














