Hyderabad: రూ. 50 లక్షలతో క్రెడిట్ కార్డ్.. ఫోన్లు పంపిస్తారు.. దొరికినంత దోచేస్తారు.. పశ్చిమబెంగాల్ హైటెక్ ముఠా గుట్టురట్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటూ దేశవ్యాప్తంగా వల విసురుతున్న ఈ ముఠాలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈసారి ఏకంగా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) పేరు వాడుకుంటూ, బాధితుల ఇళ్లకే కొరియర్ ద్వారా ఫోన్లు పంపించి, గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఒక అంతరాష్ట్ర హైటెక్ ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటూ దేశవ్యాప్తంగా వల విసురుతున్న ఈ ముఠాలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 15 లక్షల నగదు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాయిమనోహర్ కేసు వివరాలను వెల్లడించారు.

మోసం చేసే వ్యూహం ఇదే

పశ్చిమబెంగాల్‌కు చెందిన సలీం మండల్ (ప్రధాన నిందితుడు), సయ్యద్ హసీ రెజా, బన్సీధార, అబ్దుల్ అలీం, మిజానూర్ రెహమాన్ షేక్, మెహబూబ్ ఆలం అన్సారీలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరి మోసపూరిత విధానం అత్యంత పకడ్బందీగా సాగుతుంది. మొదటగా బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న ధనికుల వివరాలను ఈ ముఠా సేకరిస్తుంది. బాధితులకు ఫోన్ చేసి, తాము ‘సిటీబ్యాంక్’ నుంచి మాట్లాడుతున్నామని, రూ. 50 లక్షల లిమిట్‌తో కొత్త క్రెడిట్ కార్డు ఇస్తామని నమ్మిస్తారు.

DoT తనిఖీ లింక్

బాధితుడు క్రెడిట్ కార్డుకు అంగీకరించగానే అసలు కథ మొదలవుతుంది. క్రెడిట్ కార్డు జారీ చేసే ముందు టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) నిబంధనల ప్రకారం ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేయాలని చెబుతారు. ఒకవేళ బాధితుడు ఈ-సిమ్ (e-SIM) వాడుతుంటే, దానిని ఫిజికల్ సిమ్ కార్డుగా మార్చుకోవాలని సూచిస్తారు. తనిఖీ ప్రక్రియ కోసం తాము దిల్లీ నుంచి కొరియర్ ద్వారా ఒక ప్రత్యేక ఫోన్ పంపిస్తున్నామని, అందులో బాధితుడి సిమ్ కార్డు వేసి ఆన్ చేస్తేనే వెరిఫికేషన్ పూర్తవుతుందని నమ్మిస్తారు.

మాల్‌వేర్ అటాక్: నేరగాళ్లు పంపే ఫోన్లలో ముందే ప్రమాదకరమైన ‘మాల్‌వేర్’ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి ఉంచుతారు. బాధితుడు తన సిమ్ కార్డును ఆ ఫోన్ లో వేయగానే, అతని మొబైల్‌కు వచ్చే బ్యాంకింగ్ ఓటీపీలు (OTPs), మెసేజ్‌లు అన్నీ నేరగాళ్ల స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. దీనిని ఆసరాగా చేసుకుని గంట వ్యవధిలోనే ఖాతాలోని డబ్బునంతా కాజేస్తారు.

హైదరాబాద్‌లో ఒకరికే రూ. 77.75 లక్షల నామం

హైదరాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ అనే వ్యక్తి ఈ ముఠా వలలో పడి ఏకంగా రూ. 77.75 లక్షలు పోగొట్టుకున్నాడు. గతేడాది ఆగస్టులో క్రెడిట్ కార్డు పేరుతో ఇతనికి కొరియర్ ఫోన్ పంపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి, ఎస్సై నాగేశ్వరరావు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదే తరహాలో ఈ ముఠా హైదరాబాద్‌లో మరో నలుగురిని, చెన్నైలో నలుగురిని బురిడీ కొట్టించినట్లు పోలీసులు గుర్తించారు. చివరికి ఒక ప్రముఖ సినిమా నటుడి సహాయకుడికి సైతం వీరు ఫోన్ పంపి లక్షలాది రూపాయలు కాజేశారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉత్కంఠభరిత ఆపరేషన్

నిందితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వారు ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. సైబరాబాద్ ప్రత్యేక పోలీస్ బృందం పశ్చిమబెంగాల్‌లోని పండరీపూర్ ప్రాంతానికి చేరుకుంది. మొదట్లో అక్కడ ఎన్నికల వాతావరణం ఉండటం, స్థానిక పోలీసుల సహకారం సకాలంలో అందకపోవడంతో ప్రధాన నిందితుడు సలీం మండల్ త్రుటిలో తప్పించుకున్నాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గని సైబరాబాద్ పోలీసులు, అక్కడే రోజుల తరబడి మకాం వేసి, పక్కా స్కెచ్‌తో సలీం మండల్‌తో సహా మిగతా ఐదుగురు నిందితులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports