Last Updated:
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. షూటింగ్‌లో స్వర్ణంతో పాటు ఒకేరోజు ఆరు పతకాలు సాధించడంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 23కు చేరింది. కబడ్డీలో ఇరు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి.
జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. శుక్రవారం ఒక్కరోజే ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. దీంతో ఈ క్రీడల్లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 23కు (2 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు) చేరుకుంది. ఈ క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ రోజు కావడం విశేషం. ఉదయం షూటింగ్‌లో సురుచి సింగ్, కమల్‌జీత్ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి తొలి షూటింగ్ స్వర్ణాన్ని అందించింది.
ఆ వెంటనే పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, నీరజ్ కుమార్ త్రయం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో చైనా స్వర్ణం గెలవగా, కొరియా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలోనూ భారత అథ్లెట్లు అదరగొట్టారు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ 28:29.38 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకంతో మెరిశాడు. మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ 17.17 మీటర్ల దూరం గుండు విసిరి కాంస్యం సాధించగా, మహిళల పోల్ వాల్ట్‌లో బరనిక ఇలంగోవన్ 4.25 మీటర్ల ఎత్తు దూకి కాంస్య పతకాన్ని పంచుకుంది. మరోవైపు టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ జోడీని ఓడించి సంచలనం సృష్టించిన మానుష్ షా, దియా చితాలే జంట సెమీస్‌లో చైనా చేతిలో ఓడి చారిత్రక కాంస్య పతకాన్ని ముద్దాడింది.
ఇతర క్రీడల్లోనూ భారత్‌కు మరిన్ని పతకాలు ఖాయమయ్యాయి. కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. సెమీఫైనల్లో మహిళల జట్టు 48-24తో నేపాల్‌ను చిత్తు చేయగా, పురుషుల జట్టు 66-28తో థాయ్‌లాండ్‌ను మట్టికరిపించింది. మహిళల హాకీ జట్టు ఆతిథ్య జపాన్‌పై 3-1 తేడాతో గెలిచి అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టింది. స్క్వాష్‌లో అభయ్ సింగ్, అనాహత్ సింగ్ సింగిల్స్ సెమీస్‌కు చేరగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్ జోడీ సెమీస్ చేరి మూడు పతకాలను ఖాయం చేసింది.
కొన్ని విభాగాల్లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ తొలి రౌండ్‌లోనే అనూహ్యంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ టీమ్ కేవలం మూడు పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది. బాక్సింగ్‌లో ప్రీతి ప్రీక్వార్టర్స్‌లో ఓడిపోగా, 60 కేజీల విభాగంలో సచిన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అథ్లెటిక్స్ 400 మీటర్ల పరుగులో కిరణ్, ప్రాచీ, విశాల్ టీకే సెమీస్‌కు అర్హత సాధించారు. బ్యాడ్మింటన్‌లో త్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ, ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంట, సింగిల్స్‌లో ఉన్నతి హుడా తమ మ్యాచ్‌లలో గెలిచి ముందంజ వేశారు.














