Alcohol Market: మందుబాబులా.. మజాకా! దేశ జీడీపీలో రూ.6.2 లక్షల కోట్లు వీళ్లదే.. 2.5 కోట్ల మందికి ఉపాధి! | | ACTPnews

Alcohol Market: మందుబాబులా.. మజాకా! దేశ జీడీపీలో రూ.6.2 లక్షల కోట్లు వీళ్లదే.. 2.5 కోట్ల మందికి ఉపాధి! |


పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించడమే కాకుండా, వ్యవసాయం నుంచి హోటల్ రంగం వరకు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వాటాదారుగా ఈ రంగం తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.

ఖజానాకు రూ. 4 లక్షల కోట్ల పన్నుల వరద

ప్రభుత్వాల ఆదాయంలో మద్యం రంగం పోషిస్తున్న పాత్ర అసాధారణమైనది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర పన్నులు కలిపి ఈ ఒక్క రంగం నుంచే సుమారు రూ. 4 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు సమకూరింది. దేశం మొత్తం పన్ను వసూళ్లలో ఇది 6.6 శాతం కాగా, పరోక్ష పన్నుల వసూళ్లలో ఏకంగా 11.3 శాతంగా నమోదైంది. దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలిస్తే, ఆయా రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయంలో మద్యం వాటా సగటున 19 శాతంగా ఉంది.

పలు పెద్ద రాష్ట్రాలైతే తమ సొంత పన్ను రాబడిలో 20 శాతానికి పైగా మద్యం అమ్మకాలపైనే ఆధారపడుతున్నాయి. రహదారులు, ఆసుపత్రులు, విద్య, సామాజిక సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ఈ నిరంతర ఆదాయమే రాష్ట్రాలకు ప్రధాన అండగా నిలుస్తోంది.

కోటి మందికి పైగా రైతులకు జీవనోపాధి

ఒక మద్యం సీసా కౌంటర్‌పైకి చేరడానికి ముందే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావాన్ని చూపుతోంది. మద్యం తయారీ కోసం తృణధాన్యాలు, చెరకు, మొలాసిస్, బార్లీ, ద్రాక్ష వంటి వ్యవసాయ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తుండటంతో రైతులకు నిరంతర మార్కెట్ డిమాండ్ దక్కుతోంది. 2025 నాటికి దేశంలో దాదాపు 24.2 లక్షల నుంచి 25.5 లక్షల వ్యవసాయ క్షేత్రాలు ఈ పరిశ్రమకు ముడిసరుకును అందిస్తున్నాయి.

తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1.28 కోట్ల మంది రైతు కుటుంబాల జీవనోపాధికి ఈ పరిశ్రమ తోడ్పడుతోంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలో వచ్చే 14 నుంచి 19 శాతం ఆదాయం మద్యం విక్రయాలతోనే ముడిపడి ఉంది. రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్‌లు కేవలం డ్రింక్స్ ద్వారానే కాకుండా, అక్కడికి వచ్చే కస్టమర్ల వినోదం, ఆహార ఖర్చులతో లాభాలు గడిస్తున్నాయి.

1.44 కోట్ల ఉద్యోగాలకు ఆసరా.. గ్లాస్ పరిశ్రమపై పట్టు

దేశవ్యాప్తంగా సుమారు 1.32 లక్షల లైసెన్స్ పొందిన మద్యం రిటైల్ అవుట్‌లెట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లైసెన్స్ పొందిన హోటళ్లు, రెస్టారెంట్లలో 9.2 లక్షల నుంచి 11 లక్షల ఉద్యోగాలు ఉండగా, రిటైల్ మద్యం దుకాణాలు 4.8 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. మొత్తంగా వ్యవసాయం, రిటైల్, ఆహార సేవా రంగాల్లో కలిపి సుమారు 1.44 కోట్ల మందికి ఈ పరిశ్రమ ఉపాధినిస్తోంది. అనుబంధ రంగాలను చూస్తే, దేశీయంగా తయారయ్యే కంటైనర్ గ్లాస్ డిమాండ్‌లో 70 శాతం వాటా మద్యం పరిశ్రమదే కావడం విశేషం. దీని విలువ రూ. 10,000 కోట్లుగా ఉంది. దీనికితోడు రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో ఏటా రూ. 5,800 కోట్ల మేర ఆర్థిక కార్యకలాపాలు కేవలం మద్యం బాటిళ్ల సరఫరా వల్లే సాగుతున్నాయి.

ప్రీమియం బాటిళ్ల వైపే మందుబాబుల మొగ్గు

వినియోగదారుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు పరిశ్రమను కొత్త మలుపు తిప్పుతున్నాయి. తక్కువ ధర బ్రాండ్ల కంటే నాణ్యమైన, ఖరీదైన ప్రీమియం మద్యం వైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 2022 నుంచి 2025 మధ్య కాలంలో చౌక మద్యం ఉత్పత్తులు 1.1 శాతం, రెగ్యులర్ బ్రాండ్లు 1.4 శాతం వార్షిక సగటు వృద్ధిని మాత్రమే నమోదు చేయగా, ప్రీమియం విభాగం మాత్రం ఏకంగా 10.2 శాతం అద్భుత వృద్ధి రేటుతో దూసుకుపోతోంది.

భారత ఆల్కోబెవ్ పరిశ్రమ అపారమైన మార్కెట్ సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రీమియం ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే వ్యాపారాలను నిర్మించడమే తదుపరి లక్ష్యమని ఇస్వాయ్ సీఈఓ సంజిత్ పాఢీ తెలిపారు. ఆర్థిక విలువ, పన్నులు, ఉపాధి పరంగా దేశ ప్రగతిలో ఈ పరిశ్రమ తిరుగులేని భాగస్వామిగా నిలిచిందని ఆర్థిక సంఘం మాజీ కార్యదర్శి అరవింద్ మెహతా పేర్కొన్నారు.

వేర్వేరు నిబంధనల సవాలు.. సంస్కరణల బాట

భారీ ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ రాష్ట్రాల వారీగా వేర్వేరు పన్నులు, లైసెన్సింగ్ విధానాలు, ధరల నియంత్రణ నిబంధనలు ఉండటం పరిశ్రమకు పెద్ద సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి నియంత్రణలు, హేతుబద్ధమైన పన్నులు, డిజిటల్ పద్ధతులు అమలులోకి వస్తే పరిశ్రమ పూర్తి స్థాయి సామర్థ్యం బయటకు వస్తుందని నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పారదర్శకత, వ్యాపార సౌలభ్యం కోసం డిజిటలైజేషన్ సంస్కరణలను అమలు చేస్తున్నాయని, వీటిని మరింత విస్తరిస్తే అదనపు పెట్టుబడులు రావడంతో పాటు ప్రభుత్వాలకు మరింత స్థిరమైన రాబడి సమకూరుతుందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports