Last Updated:
రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’ విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ విడుదల తేదీల్లో మరోసారి మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 8న దేశవ్యాప్తంగా విడుదల చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా దీపావళికి ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్‌లో నవంబర్ 4న పెయిడ్ ప్రీమియర్ షోలు వేయనున్నారని, ఆ తర్వాతి రోజైన నవంబర్ 5న భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురానున్నారని పింక్‌విల్లా కథనం వెల్లడించింది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఓవర్సీస్‌లో విడతల వారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నార్త్ అమెరికాలో నవంబర్ 4న ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్, సౌత్‌ఈస్ట్ ఆసియా, జర్మనీ, లాటిన్ అమెరికాతో పాటు ఇతర యూరప్ దేశాల్లో నవంబర్ 5న విడుదల చేయనున్నారు. యూకే, సౌతాఫ్రికా, మారిషస్‌లలో నవంబర్ 6న థియేటర్లలోకి తెస్తారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, హాంకాంగ్ దేశాల్లో రిలీజ్ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. గతంలో నమిత్ మల్హోత్రా చెప్పిన షెడ్యూల్ కంటే ముందే సినిమాను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.
ఈ పౌరాణిక దృశ్యకావ్యంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. వీరితో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కీలక పాత్రలు పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ డీనెగ్ (DNEG) ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ స్వరకర్త హన్స్ జిమ్మెర్, భారత లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కలిసి అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.














