Last Updated:
ఈ వీక్ రిలీజ్ కాబోతున్న క్రేజీ కళ్యాణం సినిమాపై ఆడియెన్స్‌లో ఫుల్ పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌తో ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లారిటీ వచ్చేసింది.
ఈ వీక్ రిలీజ్ కాబోతున్న క్రేజీ కళ్యాణం సినిమాపై ఆడియెన్స్‌లో ఫుల్ పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌తో ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లారిటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా పెళ్లంటే చాలా ఎన్నో ఆలోచనల్లో పడిపోతున్న ఇప్పటి జనరేషన్‌కు ఇలాంటి స్టోరీతో సినిమా రావడం మంచి ప్రయత్నమే. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరణ్, సీనియర్ యాక్టర్ నరేష్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రాజు వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దసరా పండుగ స్పెషల్‌గా అక్టోబర్ 16న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా క్రేజీ కళ్యాణం మూవీ విశేషాలను యాక్టర్ నరేష్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు…
ఈ సినిమాలో తాను చేసిన ఆరు నిమిషాల నిడివి ఉన్న నవరసాల సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నరేష్ తెలిపారు. దాదాపు 350 క్యారెక్టర్ల మధ్య తొమ్మిది పాత్రలతో ఒక్కో ఎమోషన్‌ను పలికిస్తూ డైలాగ్స్ చెప్పే సీన్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేసినట్లు వెల్లడించారు. మొదట ఈ సీన్ చేయడానికి భయపడ్డానని, ఇలాంటి సన్నివేశానికి ఎలాంటి రిఫరెన్స్ లేదని చెప్పారు. అయితే దర్శకుడు బద్రప్ప తననే రిఫరెన్స్‌గా తీసుకోవాలని చెప్పడంతో ఆ సీన్‌ను పూర్తి చేసినట్లు వివరించారు. ఈ సినిమాలోనే తొలిసారి తన ‘నవరసరాయ’ టైటిల్‌ను ఉపయోగిస్తున్నామని తెలిపారు.
క్రేజీ కల్యాణం ఒక మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో సాగే కథ అని నరేష్ వివరించారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే భావోద్వేగ సంఘర్షణ ఈ సినిమాకు ప్రధాన బలమని చెప్పారు. ఫన్‌తో పాటు ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, ముఖ్యంగా ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉండే అనుబంధం యూనివర్సల్ ఎమోషన్ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో రక్తపాతం, హింసకు ప్రాధాన్యత ఉండదని.. వినోదం, భావోద్వేగాలతో కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందని తెలిపారు.
దర్శకుడు బద్రప్ప గాజుల పనితీరుపై నరేష్ ప్రశంసలు కురిపించారు. ఆయన కథ చెప్పిన విధానం, పాత్రలను తీర్చిదిద్దిన తీరు తనకు బాగా నచ్చాయని తెలిపారు. బద్రప్పను ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌తో పోల్చడానికి కారణం కూడా ఉందన్నారు. నేటివిటీకి దూరంగా వెళ్లకుండా, కొత్త పద్ధతిలో కథను చెప్పడం, పాత్రలకు భావోద్వేగపరమైన ప్రాధాన్యత ఇవ్వడం ఇద్దరిలోనూ కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
క్రేజీ కల్యాణం సినిమాలో తనతో పాటు తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ ఉడ్డెమారి పాత్రలు కీలకమని నరేష్ తెలిపారు. ఈ నలుగురి పాత్రలు సినిమా అనే భవనానికి నాలుగు స్తంభాల్లాంటివని చెప్పారు. తరుణ్ భాస్కర్ పోషించిన బాలరాజు పాత్ర ప్రతి ఊరిలో కనిపించే వ్యక్తిని గుర్తు చేస్తుందని, అనుపమ పాత్ర మధ్యతరగతి అమ్మాయిల జీవితాలకు దగ్గరగా ఉంటుందని వివరించారు. ఈ పాత్రలకు సరైన నటీనటులు కుదరడం సినిమాకు బలమని అన్నారు.
తాను సినిమా ఎంపిక చేసుకునేటప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడనని నరేష్ స్పష్టం చేశారు. పాత్ర నచ్చితేనే అంగీకరిస్తానని, పాన్ ఇండియా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా కథ నచ్చకపోతే చేయలేదని తెలిపారు. కొత్త దర్శకులు తన దగ్గరకు వచ్చి కథలు చెబుతున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడతానని చెప్పారు. క్రేజీ కల్యాణం కథను దర్శకుడు బద్రప్ప మొదట తనకే చెప్పారని, కథ నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సినిమాలు ప్రపంచ సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సవాలుగా మారిందని నరేష్ అభిప్రాయపడ్డారు. అయితే నిజాయితీగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. క్రేజీ కల్యాణం టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందని, సినిమాకు కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా దసరా పండుగకు కుటుంబ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.














