Last Updated:
మొన్న పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ నెగ్గితే.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన ఈ పోరులో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) అంచనాలకు అందకుండా సాగుతోంది. హాట్ ఫేవరెట్ టీమ్స్ అయిన పంజాబ్ కింగ్స్ (PBKS vs RCB), ఆర్సీబీ (RCB vs PBKS) జట్లు రెండో అంచె పోటీల్లో ఓటములను చవి చూస్తున్నాయి. మొన్న పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ నెగ్గితే.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన ఈ పోరులో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో 5వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతానికి టాప్ ప్లేస్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఐదో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు మధ్య ఉన్న పాయింట్ల అంతరం కేవలం 3 పాయింట్లే.. దాంతో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. కోహ్లీ (28) ఫర్వాలేదనిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 3 వికెట్లు.. రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్లు చెరో 2 వికెట్లతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేజ్ చేసింది. కేవలం 15.5 ఓవర్లలోనే 6 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసి లీగ్‌లో 5వ విజయాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. జాస్ బట్లర్ (39) రాణించాడు. చివర్లో తెవాటియా (27 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.
రెండో అంచె పోటీలు మొదలు కావడంతో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ ప్రస్తుతం టాప్ 4లో ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉంది. ప్లే ఆఫ్స్ సమరం ఈ ఐదు జట్ల మధ్యే ఉండే అవకాశం ఉంది. మిగిలిన జట్లు ప్లే ఆఫ్స్ చేరాలంటే కష్టంగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 12 పాయింట్లతో ఆర్సీబీతో సమంగా ఉంది. అయితే నెట్ రన్ రేట్‌లో వెనుకబడి ఉండటంతో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్‌కు రాజస్తాన్ రాయల్స్ రూపంలో తొలి ఓటమి ఎదురైంది. ప్రస్తుతం ఆ జట్టు 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది.
ఇక ముంబై ఇండియన్స్, కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలి ఉన్న అన్ని మ్యాచ్‌ల్లోనూ నెగ్గాల్సి ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్ అవకాశాలు దూరం అవుతాయి. ఇక ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌లది కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రస్తుతానికి అయితే పంజాబ్, ఆర్సీబీ, సన్ రైజర్స్, రాజస్తాన్, గుజరాత్ టైటాన్స్ జట్లకే ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













