ఏసీ ఆఫీసులు, లక్షల జీతాలు, కార్పొరేట్ హోదాలు.. ఇవే నేటి సమాజంలో విజయానికి కొలమానాలుగా భావిస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరి విజయ నిర్వచనం ఒకేలా ఉండదు. కొందరికి డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం, మరికొందరికి హోదా కంటే సంతృప్తి ముఖ్యమవుతుంది. అలాంటి ఓ వ్యక్తి జీవిత కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన కుమార్ అనే వ్యక్తి ఒకప్పుడు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. మంచి జీతం, భద్రమైన ఉద్యోగం ఉన్నప్పటికీ తన మనసుకు నచ్చిన పనిని ఎంచుకుని ఇప్పుడు క్యాబ్ డ్రైవర్‌గా కొనసాగుతున్నారు.
సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి క్యాబ్ డ్రైవర్‌గా మారడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ కుమార్ మాత్రం తన నిర్ణయాన్ని జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయంగా భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచే డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న ఆయన, కార్పొరేట్ ఉద్యోగంలో పని చేస్తున్నప్పటికీ ఆ ఆసక్తిని మర్చిపోలేకపోయారు. రోజూ ఒకే విధమైన పనులు, ఆఫీస్ ఒత్తిడి, నిర్దిష్టమైన దినచర్య మధ్య తనకు కావాల్సిన సంతృప్తి దొరకడం లేదని భావించారు.
ఈ క్రమంలోనే ధైర్యమైన నిర్ణయం తీసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం క్యాబ్ డ్రైవింగ్‌ను పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకున్నారు. 2014లో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 12 సంవత్సరాలుగా క్యాబ్ డ్రైవర్‌గా సేవలందిస్తున్న కుమార్ ఇప్పటివరకు 23,600కు పైగా ట్రిప్పులను పూర్తి చేశారు. ఈ సంఖ్య ఆయన అనుభవాన్ని, పనిపట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తోంది.
కుమార్ కథను ప్రముఖ కంటెంట్ క్రియేటర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ చేతనా సింగ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కుమార్‌తో మాట్లాడిన ఆమె, ఆయన జీవిత ప్రయాణాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో కుమార్ తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరించారు.
“ప్రతి రోజు కొత్త వ్యక్తులను కలవడం నాకు చాలా ఇష్టం. ఒక్కో ప్రయాణికుడికి ఒక్కో కథ ఉంటుంది. వారి జీవిత అనుభవాలు, విజయాలు, కష్టాలు వింటుంటే చాలా నేర్చుకోవచ్చు. ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలవడం, నగరాన్ని చుట్టేయడం, విభిన్న అనుభవాలు పొందడం వల్ల నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో దొరకని సంతృప్తి డ్రైవింగ్‌లో దొరికింది” అని కుమార్ తెలిపారు.
కేవలం డ్రైవర్‌గా మాత్రమే కాకుండా, మంచి సేవలు అందించే వ్యక్తిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం, సమయపాలన పాటించడం, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం వంటి అంశాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తూ ప్రముఖ క్యాబ్ సేవా సంస్థలో టాప్ డ్రైవర్లలో ఒకరిగా నిలిచారు. ఆయనకు ప్రయాణికుల నుంచి అత్యుత్తమ రేటింగ్‌లు కూడా లభించాయి.
కుమార్ కథ సోషల్ మీడియాలో వేలాది మందిని ఆలోచింపజేస్తోంది. “జీతం ఎక్కువగా ఉండటం మాత్రమే విజయం కాదు”, “మనసుకు నచ్చిన పని చేస్తూ ఆనందంగా జీవించడం కూడా గొప్ప విజయమే”, “సమాజం ఏమనుకుంటుందో కంటే మనకు నచ్చిన జీవితాన్ని జీవించడం ముఖ్యం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు తమకు నచ్చిన రంగాల్లోకి వెళ్లేందుకు కుమార్ కథ ప్రేరణగా నిలుస్తోందని పేర్కొంటున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది డబ్బు, హోదా, ఉద్యోగ భద్రత కోసం తమ ఇష్టాలను పక్కన పెడుతుంటారు. అయితే కుమార్ కథ మాత్రం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. జీవితంలో నిజమైన విజయం అంటే కేవలం అధిక జీతం లేదా పెద్ద హోదా కాదు.. మనసుకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా జీవించగలగడం కూడా అంతే గొప్ప విజయమని ఆయన నిరూపించారు.












