Last Updated:
Rachna Gurjar Viral Video: వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ చేసిన రీల్ వీడియో ఆమె తలరాతను మార్చేసింది. రాత్రికి రాత్రే లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు తెల్లవారేలోగా మాయం అయ్యాయి. పర్సనల్ విషయాలు, తన లగ్జరీ జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
Viral Video: మనలో చాలా మందికి తమకున్న సంపదను, విలాసవంతమైన జీవనశైలిని సోషల్ మీడియాలో ప్రదర్శించడం సర్వసాధారణం అయిపోయింది. కానీ కొన్నిసార్లు ఈ ఆర్భాటం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బంగారు ఆభరణాల రీళ్లను పోస్ట్ చేసిన మధ్యప్రదేశ్‌కి చెందిన యూట్యూబర్ రచనా గుర్జర్ అనే మహిళ రాత్రికి రాత్రే నిరుపేదగా మారిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. వ్యూస్ కోసం చేసిన రీల్ వీడియో వల్ల తన కొంప కొల్లేరు అవుతుందని ఊహించలేకపోయింది రచనా గుర్జర్. చివరకు తన సొమ్ము, నగలు దొంగలు ఎత్తుకెళ్లారంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆమె చేసిన తెలివి తక్కువ పని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు, కుటుంబ విషయాలను కాస్తో కూస్తో గోప్యంగా ఉంచుకోకపోతే ఇలాంటివే జరుగుతాయని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా మోహని గ్రామానికి చెందిన గృహిణి కమ్ యూట్యూబర్ రచనా గుర్జర్ సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి సుపరిచితురాలు. అయితే ఇప్పటికే పలు వీడియోలు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసి ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్న రచనా తాజాగా చేసిన ఓ రీల్ వీడియో కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. తనకు ఇంట్లో అన్నీ రకాల నగలు, బంగారు గొలుసులు, ఉంగరాలు ఉన్నాయంటూ వాటిని చూపిస్తూ .. కొన్నింటిని పెట్టుకుంటూ ఓ వీడియో రీల్ చేసింది.
.
రచనా గుర్జర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భారీ బంగారు ఆభరణాలు, నెక్లెస్‌లు, బ్రేస్‌లెట్‌లు, చెవిపోగులతో పాటు ఇతర నగల రీళ్లను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉండేది. ఈక్రమంలోనే శుక్రవారం కూడా ఆకర్షణీయమైన లైటింగ్, సంగీతం , క్యాప్షన్‌లతో కూడిన ఈ రీళ్లు వైరల్ అయ్యాయి. వాటిని లైక్ చేసి, కామెంట్ చేసే వేలాది మంది ఫాలోవర్లను ఇవి ఆకర్షించాయి. కానీ ఈ ఫాలోవర్లలో కొందరు దొంగలు కూడా ఉన్నారనే విషయం రచనా గుర్తించలేకపోయింది. శనివారం తెల్లవారుజామున యూట్యూబర్ రచనా గుర్జర్ ఇంట్లో దొంగలుపడ్డారు. ఆమెను, ఆమె కుటుంబాన్ని ఒక గదిలో బంధించి, బంగారం, వెండి ఆభరణాలు, నగదు, ఇంకా ఒక ఎనర్జీ డ్రింక్ కార్టన్‌తో సహా దోచుకెళ్లారు. దొంగిలించబడిన వస్తువుల మొత్తం విలువ రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
రచనా చేసిన రీల్ వీడియోని ఆధారంగా చేసుకొని దొంగలు ఆమె ఇంటి చిరునామా ,దినచర్య గురించి సమాచారం సేకరించారు. ఒక రాత్రి, రచనా తన కుటుంబంతో కలిసి నిద్రపోతున్నప్పుడు, వారు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. వారు ప్రధానంగా బంగారు ఆభరణాలను లక్ష్యంగా చేసుకున్నారు. వారు బీరువాను పగలగొట్టి, అందులోని ఆభరణాలన్నీ, కొంత నగదు , ఇతర విలువైన వస్తువులను దొంగిలించారు. ఉదయం నిద్రలేచినప్పుడు, రచన తన ఇంటి పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురైంది. పడకగది మొత్తం చిందరవందరగా ఉంది. అల్మరాలు ఖాళీగా ఉన్నాయి. నగల బాక్సులు తెరిచి ఉన్నాయి. రచన వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఒక పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. దొంగల కోసం వెతకడానికి సీసీటీవీ ఫుటేజ్, సమీపంలోని కెమెరాలను ఉపయోగిస్తున్నారు. శివపురి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ ములే ఈ దొంగతనాన్ని ధృవీకరించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి.
రచన గుర్జర్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినది గృహిణి, యూట్యూబర్. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్ నగల కంటెంట్‌ను సృష్టించడం ద్వారా మంచి ఆదాయం సంపాదించేది. రచనాకు కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే 290k ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె రీల్స్‌లో తరచుగా లక్షల రూపాయల విలువైన నగలు కనిపించేవి. ఇరుగుపొరుగు వారి ప్రకారం, రచనకు తన నగలంటే చాలా ఇష్టం. వాటిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ ఆనందించేది. కానీ ఆమె వాటి భద్రతపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు.
ఈసంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఇన్‌ఫ్లూయెన్సర్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. విలాసవంతమైన వస్తువులను సోషల్ మీడియాలో చూపించడం అంటే దొంగలను ఆహ్వానించడం లాంటిదని తిట్టిపోస్తున్నారు. ఈ రోజుల్లో దొంగలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ పోస్టులను గమనిస్తూ ఉంటున్నారని.. అలాంటి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని, కాస్త గోప్యత పాటించాలని చెప్పారు. ఇక యూట్యూబర్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలను గుర్తించడానికి పోలీసులు రచన ఫాలోవర్ల జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. తమ విలాసవంతమైన జీవనశైలి, ఆభరణాలు, కార్లు, ఇళ్ల ఫోటోలను రోజూ పంచుకుంటే ఇలాంటి గుణపాఠంగా తప్పదని హెచ్చరిస్తున్నారు.
Hyderabad,Telangana













