Last Updated:
టీ20 సిరీస్‌లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా సమీక్షించనుంది.
IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీ20 సిరీస్‌లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా సమీక్షించనుంది. నిజానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరకు ఉన్నప్పటికీ, జట్టు ఇటీవలి పేలవమైన ఆటతీరుతో ఆయన పదవికే ముప్పు పొంచి ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా బ్యాక్-టు-బ్యాక్ రెండు టీ20 సిరీస్‌లను కోల్పోయింది. మొదట ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 3-0తో వెనుకబడి సిరీస్‌ను చేజార్చుకుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అందులో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ పర్యటనలో మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్లే బీసీసీఐ ఈ సమీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను జట్టు నుండి తప్పించడంపై మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 తర్వాత శాంసన్‌ను పక్కన పెట్టారు. అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా బరిలోకి దించినప్పటికీ, అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
మరోవైపు ఇషాన్ కిషన్, తిలక్ వర్మల ఫామ్ కూడా టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఐర్లాండ్ సిరీస్‌తో కలుపుకొని ఈ మొత్తం పర్యటనలో తిలక్ వర్మ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే, వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ కేవలం వైస్ కెప్టెన్ (ఉప-కెప్టెన్) అనే ఒకే ఒక్క కారణంతోనే తిలక్ వర్మను జట్టు నుండి తప్పించడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేయర్‌గా ఉన్న ఇషాన్ కిషన్ సైతం ఇంగ్లండ్‌లోని పిచ్‌ల స్వింగ్, బౌన్స్‌ను తట్టుకోలేక పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














