Last Updated:
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ లుక్, పోస్టర్స్ బయటకు వచ్చినప్పటి నుంచి సినిమాపై చర్చ మరింత పెరిగింది. కథ ఏంటి? ఇందులో నటిస్తున్న పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు ఏ రోల్‌లో కనిపించనున్నారు? అనే విషయాలపై సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో ‘రాకా’లో తాను కీలక పాత్ర పోషిస్తున్నానంటూ వచ్చిన వార్తలపై మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ స్పందించారు. తన గురించి ప్రచారం అవుతున్న వార్తలకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘రాకా’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. అలాగే జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, రమ్యకృష్ణ, జిమ్ సర్బా, అర్షద్ వార్సీ, యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్, ఫెమినా జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్, అట్లీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తుండగా.. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇక భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారనే వార్తలు కూడా ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. భారీ బడ్జెట్, విస్తృతమైన కథ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ‘రాకా’ తొలి భాగం 2027 డిసెంబర్‌లో, రెండో భాగం 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సినిమాకు సంబంధించిన బడ్జెట్‌పై కూడా ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తొలుత సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ అంచనా రూ.900 కోట్లకు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా స్కేల్‌ను బట్టి చూస్తే భవిష్యత్తులో బడ్జెట్ మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి సమయంలో ‘రాకా’లో ఐశ్వర్య లక్ష్మీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుందని, నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నారని కూడా ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తలకు ఐశ్వర్య లక్ష్మీ స్వయంగా చెక్ పెట్టారు. ‘రాకా’లో తాను నటిస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ రూమర్స్ చూసి తాను నవ్వుకుంటున్నానని, ఎవరైనా తనకు ‘రాకా’లో అవకాశం ఇప్పించాలని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క కామెంట్‌తో తనపై వస్తున్న ప్రచారానికి ఐశ్వర్య లక్ష్మీ క్లారిటీ ఇచ్చినట్లైంది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














