Last Updated:
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కలిసి నటిస్తన్న తొలి సినిమా ‘రణబాలి’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రష్మికపై విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ క్యూట్ పెయిర్, రియల్ లైఫ్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ (Ranabaali). ఈ సినిమా కోసం హీరో హీరోయిన్ల అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో అలరించిన ఈ జంట.. భార్యాభర్తలుగా మారిన తర్వాత మొదటిసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. దసరా పండుగ కానుకగా ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబరు 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ఓ సరదా ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో కలిసి విజయ్, రష్మిక పాల్గొన్న ఈ చిట్‌చాట్ ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రష్మిక వంట చేయడంపై విజయ్ దేవరకొండ చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్‌గా మారాయి. “రష్మిక వంట చేస్తే ఓ యుద్ధం చేసినట్లే” అని విజయ్ తనదైన శైలిలో ఆటపట్టించగా, దానికి రష్మిక ఇచ్చిన క్యూట్ రియాక్షన్స్ అభిమానులను మురిపిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ సైతం సినిమా విశేషాలను పంచుకున్న ఈ పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఆదివారం ఉదయం యూట్యూబ్‌లో ప్రసారం కానుంది.
విజయ్ దేవరకొండకు గతంలో ‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ ‘రణబాలి’ చిత్రాన్ని అత్యంత భారీ కాన్వాస్‌పై పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిషర్ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఆంగ్లేయులపై వీరోచితంగా పోరాడే ‘సింగనమల బొబ్బిలి రణబాలి’ అనే ధైర్యశాలి అయిన యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు. ఇక ఆయన భార్య ‘జయమ్మ’ పాత్రలో రష్మిక నటిస్తోంది.
పెళ్లి తర్వాత ఈ రియల్ లైఫ్ కపుల్ నటిస్తున్న తొలి సినిమా కావడం, విజయ్-రష్మిక ఇద్దరూ పూర్తి భిన్నమైన డీ-గ్లామరైజ్డ్ పీరియాడిక్ పాత్రల్లో కనిపించనుండటంతో ట్రేడ్ వర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి తదితర అంశాలతో రాబోతున్న ‘రణబాలి’ దసరా బరిలో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.














