Last Updated:
హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాన్ మీట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రోలింగ్ మానేసి, నచ్చిన అమ్మాయి ఇంటి ముందు పడిగాపులు కాయండి అంటూ బన్నీ ఇచ్చిన సలహాపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ మీట్ ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీసింది. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్, ఫ్యాన్ వార్స్ మానేయాలని చెబుతూ బన్నీ చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. తన అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్, హేటర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నచ్చని వ్యక్తుల మీద సమయం వృథా చేయొద్దని ఆయన సూచించారు. “మీ దగ్గర వంద రూపాయలు ఉంటే నచ్చని వస్తువు కోసం ఖర్చు చేస్తారా? అలాగే మీ సమయాన్ని కూడా నచ్చని వారి కోసం కేటాయించకండి.
దాని బదులు మీకు నచ్చిన పనులు చేయండి. కావాలంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు వెళ్లి వెయిట్ చేయండి” అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ట్రోలింగ్‌ను ఆపమని చెప్పడం బాగానే ఉన్నా, దానికి బదులుగా అమ్మాయిల ఇళ్ల చుట్టూ తిరగమని చెప్పడం ఏంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అల్లు అర్జున్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మాయిలను వెంబడించడాన్ని (స్టాకింగ్) ఆయన ప్రోత్సహిస్తున్నారని, సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడిట్ లాంటి వేదికల్లో బన్నీపై విమర్శల వర్షం కురుస్తోంది. “ఇలాంటి కామెంట్స్ వల్ల కొందరు యువకులు దారి తప్పే ప్రమాదం ఉంది. వేరే హీరోల ఫ్యాన్స్ మీ కుటుంబ సభ్యుల ఇళ్ల ముందు ఇలాగే వెయిట్ చేస్తే ఊరుకుంటారా?” అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
గతంలో సినిమాల్లోని సన్నివేశాలను చూసి అమ్మాయిలను వేధించిన ఘటనలు చాలా ఉన్నాయని, ఒక స్టార్ హీరో ఇలాంటి సలహాలు ఇవ్వడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తీవ్రమైన విమర్శలపై అల్లు అర్జున్ లేదా ఆయన బృందం ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఈ వివాదం ఎటు దారితీస్తుందోనని ఆయన అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.
సినిమాల విషయానికి వస్తే బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’, ‘పుష్ప 2’ విజయాలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ‘AA23’ వర్కింగ్ టైటిల్‌తో మరో భారీ యాక్షన్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














